”మన సినిమాల్ని తప్ప మనం అన్ని సినిమాల్నీ చూస్తాం”
– ఆదివారం పూట.. చక్కటి సాయింత్రం.. దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది.
అంటే ఆయన ఉద్దేశ్యం.. డబ్బింగ్ సినిమాల్ని, పరభాషా హీరోల సినిమాల్ని మనం మన సినిమాల కంటే ఎక్కువ ప్రేమిస్తాం అని.
హరీష్ తీసిన ‘మిస్టర్ బచ్చన్’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. బహుశా ఆ ఫస్ట్రేషన్లో హరీష్ అలా మాట్లాడి ఉండొచ్చు.
‘మిస్టర్ బచ్చన్’ తరవాత చాలా సినిమాలు వచ్చాయి. ఆడాయి. అవన్నీ తెలుగు సినిమాలే. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.300 కోట్లు ఇచ్చారు ఆడియన్స్.
‘డాకూ మహారాజ్’కు కూడా రూ.150 కోట్లు కట్టబెట్టారు.
నిన్నా మొన్నటి ‘తండేల్’ రూ.100 కోట్ల క్లబ్లో చేరింది.
ఇవన్నీ తెలుగు సినిమాలే. తెలుగువాళ్లు తీసిన సినిమాలే. మనం చూశాం. ఆదరించాం. ఇది హరీష్‌కు ఎందుకు అర్థం కాలేదో..?
తెలుగువాళ్ల గొప్పదనం ఏమిటంటే.. అన్ని సినిమాల్నీ తెలుగు సినిమాల్లానే ఆదరిస్తారు. మనకు డబ్బింగ్ సినిమానా, స్ట్రయిట్ సినిమానా అనే బేధం లేదు. అందుకే.. మిగిలిన భాషల వాళ్లు మన ప్రేక్షకులపై విపరీతమైన గౌరవాన్ని చూపిస్తారు. సినిమాని సినిమాలా చూసే గొప్ప గుణాన్ని కొనియాడతారు. హరీష్‌కి ఇదెందుకు అర్థం కాదో?
తెలుగులో పరభాషా హీరోయిన్లని, విలన్లి తీసుకొచ్చే దర్శకులు మనకున్నారు. వాళ్లకు బాషా బేధం లేదు. టాలెంట్ ముఖ్యం అని నమ్ముతారు. సినిమాల విషయంలోనూ అంతే కదా హరీష్ జీ..!
అలాంటప్పుడు మన వాళ్లపై మనం సెటైర్లు వేసుకోవడం ఏమిటి? కాస్త ఆలోచించండి.
ఇదే కార్యక్రమంలో తెలుగు హీరోయిన్లని అస్సలు ప్రోత్సహించకూడదు, తెలుగు రానివాళ్లని తీసుకొంటే మంచిది అనే అర్థం లో మాట్లాడారు నిర్మాత ఎస్.కె.ఎన్. మరి తెలుగు హీరోయిన్లు ఆయనకేం స్ట్రోక్ ఇచ్చారో?
ఇటీవల ఆయన తెలుగు హీరోయిన్ తో పని చేసిన సినిమా ‘బేబీ’. ఇందులో వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్టయ్యింది. వైష్ణవికి మంచి పేరొచ్చింది. బహుశా ఎస్.కె.ఎన్ తదుపరి సినిమాల్లో నటించడానికి బేబీ నిరాకరించిందేమో? అందుకే ఎస్.కే.ఎన్ అంత మాట అనేశారు.