ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు రెండూ యుద్ధాలు కొనసాగిస్తూనే అదే సమయంలో తమతమ రాష్ట్రాలలో ప్రతిపక్షాలతో కూడా యుద్దాలు చేయవలసివస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిపోవడంతో ఆ పార్టీ అప్రమత్తమవక తప్పలేదు. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో వైకాపాని బలపరుచుకొంటూ అదే సమయంలో అధికార తెదేపా వైఫల్యాలని ప్రజలకు వివరించాలనే ఆలోచనతో ఈనెల 8వ తేదీ నుండి ‘గడప గడపకి వైకాపా’ పేరుతో ఒక కార్యక్రమం మొదలుపెట్టబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వైకాపా నేతలందరూ తమ తమ నియోజక వర్గాలలో ప్రజలని కలిసి జగన్ ఆశయాలు, ప్రజా సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటాల గురించి వివరిస్తారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. దాని కోసం 100 ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నాపత్రాన్ని వైకాపా ఈరోజు ఆవిష్కరించింది.
ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాటాలు చేయడం, ఆ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా సహజమే. వైకాపా కూడా అదే పని చేస్తున్నప్పటికీ, ఇలాగ పనికట్టుకొని మరీ ఇంటింటికీ వెళ్లి తమ ప్రభుత్వం గురించి చెడ్డగా ప్రచారం చేయడం, తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణకి పూనుకోవడంపై తెదేపా ఆగ్రహం చెందుతోంది. కనుక తెదేపా కూడా వైకాపాకి జవాబుగా ప్రచారం చేయడానికి సిద్దం అవుతోంది. దాని కోసం నిర్దిష్టంగా ఇంకా ఎటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొనప్పటికీ, ఎన్నికల హామీలని అన్నిటినీ అమలు చేస్తుండటం గురించి గట్టిగా ప్రచారం చేసుకొంటూనే, జగన్ అవినీతి, అక్రమాస్తుల కేసులు, ఈడి అటాచ్మెంట్లు గురించి కూడా ప్రచారం చేయడం ద్వారా వైకాపాకి చెక్ పెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ‘గడప గడపకి వైకాపా’ కార్యక్రమం గురించి తెదేపా నేతలు ప్రస్తావిస్తూ, జగన్ అక్రమాస్తుల కేసుల గురించి కూడా మాట్లాడటం గమనిస్తే వారి వ్యూహం అదేనని స్పష్టమవుతోంది.