పట్టిసీమ ప్రాజెక్టుపై తెదేపా, వైకాపాల వాదనలు విని సామాన్య ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. తెదేపా అదొక అద్భుతమైన, పవిత్రమైన కార్యం అని అభివర్ణిస్తుంటే వైకాపా అదొక శుద్ధదండుగ ప్రాజెక్టని, దాని వలన కనీసం కృష్ణా జిల్లా రైతులకి కూడా మేలుకలగడం లేదని, కేవలం తెదేపా నేతలు, కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడానికి మాత్రమే పనికి వచ్చిందని ఎద్దేవా చేస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీళ్ళు విడుదల చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది పట్టిసీమ ద్వారా 9టి.ఎం.సి.ల నీళ్ళు కృష్ణా డెల్టాకి తరలించి వేలాది ఎకరాలలో పంటలని కాపాడగలిగామని చెప్పారు. ఈ ఏడాది కృష్ణానదిలో పెద్దగా నీళ్ళు లేకపోయినా ఈ ప్రాజెక్టు ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నామని చెప్పారు. దాని కోసం 24పంపులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టుని అడ్డుకొనేందుకు కొందరు విశ్వప్రయత్నాలు చేశారని కానీ తన సంకల్ప బలంతో ఏడాది వ్యవధిలోనే ప్రాజెక్టుని పూర్తి చేసి నదుల అనుసంధానం చేశామని చెప్పారు.
పట్టిసీమ నుంచి నీళ్ళు విడుదల చేయడంపై వైకాపా చాలా భిన్నంగా స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మావతి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “పట్టిసీమ ప్రాజెక్టుని ఇప్పటికి మూడవసారి ప్రారంభోత్సవం చేశారు. ఇంకా ఎన్నిసార్లు చేస్తారో తెలియదు. ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన పది నిమిషాలకే మొత్తం 24 మోటార్లు నిలిపివేశారు. నదులు అనుసంధానం చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి గొప్పగా ప్రారంభించిన తరువాత మోటర్లని ఎందుకు నిలిపి వేశారో వారికే తెలియాలి. పట్టిసీమ కాలువల ద్వారా విడుదల చేసిన నీళ్ళు 60వ కిమీ తరువాత ఎక్కడికి వెళ్తాయో ఎవరైనా చెప్పగలరా? పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకి నీళ్ళు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ మాటని గట్టిగా ఎందుకు చెప్పడం లేదు? కనీసం ఈ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకయినా నీళ్ళు అందించారా? అంటే అదీ లేదు. గత ఏడాది నీళ్ళు అందక కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోయిన సంగతి దాచిపెట్టి నీళ్ళు అందించామని ముఖ్యమంత్రి అబద్దాలు చెపుతున్నారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలోనే పోలవరం కుడికాలువ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. రెండేళ్ళు గడిచినా మిగిలిన ఆ 10 శాతం పనులు తెదేపా ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. పైగా ఆ కాలువ గుండా నీళ్ళు విడుదల చేసి అదేదో ఘనకార్యమన్నట్లు గొప్పగా చెప్పుకొంటోంది. పట్టిసీమ ప్రాజెక్టు కోసం వృధా చేసిన డబ్బు, శ్రమని పోలవరం ప్రాజెక్టుపై పెట్టి ఉంటే ఎంతో ప్రయోజనం ఉండేది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యం ఇస్తూ పనికిరాని పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మించారు,” అని విమర్శించారు.
పట్టిసీమ ప్రాజెక్టుపై రెండు పార్టీలు ఇంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పుడు వాటిలో ఏది నిజమో ఏదో అబద్దమో తెలియాలంటే, సంబంధిత రంగానికి చెందిన నిపుణులు మాత్రమే వివరించగలరు. లేదా ఆ రెండు పార్టీలకి చెందని మీడియా నిష్పాక్షపాతంగా పరిశోధించి కనుగొనాలి. అంతవరకు ఈ సందిగ్దత కొనసాగుతూనే ఉంటుంది.