భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ తన డిప్లమాటిక్ పాస్ర్ పోర్టును సరెండర్ చేసి రెగ్యులర్ పాస్ పోర్టు కోసం అప్లయ్ చేసుకున్నారు. ఉదయం సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లి ఈ పని పూర్తి చేశారు. సీఎంగా ఓడిపోయిన తర్వాత డిప్లమాటిక్ పాస్ పోర్టును సరెండర్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు సాధారణ పాస్ పోర్టు తీసుకోవాల్సిన అవసరం పడింది కాబట్టి ఆయన మార్చుకునేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ సీఎంగా డిప్లమాటిక్ పాస్ పోర్టు తీసుకున్నప్పటికీ అందులో రెండు అంటే రెండు సార్లు మాత్రమే స్టాంపులు పడ్డాయి. సీఎంగా ఆయన రెండు సార్లు మాత్రమే విదేశీ పర్యటనలకు వెళ్లారు. పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన పర్యటలన్నీ కేటీఆర్ చేసేవారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కు కూడా ప్రభుత్వ బృందానికి ఆయనే నాయకత్వం వహించేవారు.
కేసీఆర్ త్వరలో అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారు. మనవడు హిమాన్షు రావుతో కొంత కాలం అమెరికాలో ఉండాలని అనుకుంటున్నారని గతంలో ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో బుధవారం క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.