బీఆర్ఎస్ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై దిశానిర్దేశం చేశారు. ఏడాది పొడుగునా వేడుకలు నిర్వహించాలన్నారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇంచార్జ్ గా హరీష్ రావును నియమించారు. వంద శాతం బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యేలు మీరే అవుతారని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. యువ నేతలకు ఆయన ఈ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని ఇక ఆ పార్టీ లేవబోదని కేసీఆర్ జోస్యం చెప్పారు.
రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత వేగంగా వస్తుందని అనుకోలేదని అధికారులతో పని చేయించుకోవడం కూడా రావడం లేదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ వెనక్కి పోతోందని…పాతికేళ్ల స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయన్నారు. స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు పార్టీ నేతలందరూ కష్టపడాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ ఈ సమావేశంలో పార్టీ నేతలు కొందరిపై అసహనం వ్యక్తంచేశారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ కు చెందిన కొంత మంది ముఖ్య నేతలు వ్యతిరేక ప్రచారం చేశారని మండిపడ్డారు. పార్టీ భవిష్యత్ కష్టమని ప్రచారం చేయడంతో నైరాశ్యంతో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని అన్నారు. ఉద్యమంలో పుట్టిన పార్టీ అని .. ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదన్నారు. ఆ పార్టీ నేతలు ఎవరు అన్నదానిపై కేసీఆర్ కు సమాచారం ఉన్నా ఆయన నేరుగా ఎవరి పేరు పెట్టి చెప్పలేదు.