జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్లీనరీని పిఠాపురంలో నిర్వహిస్తున్నారు. గతంలో మూడు రోజుల పాటు నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఈ సారి మాత్రం ఒక్క రోజుకే పరిమితం చేస్తూ ప్రకటన ఇచ్చారు. మార్చి పధ్నాలుగో తేదీన మాత్రమే ప్లీనరీ జురగుతుందని జనసేన పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. అదే రోజు పార్టీ ముఖ్యనేతల సమావేశంతో పాటు పిఠాపురంలో బహిరంగసభ నిర్వహిస్తారు. పవన్ కల్యాణ్ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తారు.
ప్లీనరీని మూడు రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించడానికి కారణాలేమిటన్నదానిపై జనసేన వర్గాలు ఏమీ చెప్పడం లేదు. అయితే మూడు రోజుల పాటు నిర్వహించాలనుకున్నప్పుడు చాలా కార్యక్రమాలు అనుకున్నారు. కానీ తర్వాత అవన్నీ ఆచరణలో గందరగోళం సృష్టిస్తాయని భావించడంతో ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఒక్క రోజులోనే నిర్వహించి పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఒక్క రోజు అంటే కార్యకర్తల్లో చాలా ఉత్సాహం ఉంటుందని.. అదే మూడు రోజులు అంటే.. ఆ టెంపోను కొనసాగించడం కష్టమన్న అభిప్రాయం ఉంది. అందుకే ఒక్క రోజు చాలు అనే నిర్ణయానికి వచ్చారు.
అదే సమయంలో ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది. మూడు రోజుల పాటు పార్టీ కార్యకర్తలకు కనీస అవసరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పిఠాపురంలో అలాంటి రాజకీయ కార్యక్రమం జరగడం ఇదే మొదటి సారి. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్లీనరీని ఒక్క రోజుకే పరిమితం చేయాలని జనసేన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.