భారత రాష్ట్ర సమితిలో హరీష్ రావు ప్రాధాన్యాన్ని కేసీఆర్ అనూహ్యంగా పెంచుతున్నారు. బుధవారం జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన హరీష్ రావుకే సభ్యత్వ బాధ్యతలు ఇచ్చారు. ఈ విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. హరీష్ రావును ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేస్తూ వస్తున్నారు.ఆయన ఇతర ప్రాంతాల్లో రాజకీయం చేయడం లేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించిన సభ్యత్వం నమోదును పర్యవేక్షించే చాన్స్ ను కేసీఆర్ ఇచ్చారు.
సభ్యత్వ నమోదు పార్టీకి అత్యంత కీలకం
సభ్యత్వ నమోదు .. ఆ నేత సామర్థ్యాన్ని వెలికి తీస్తుంది. పార్టీ నేతలందరితో సమన్వయం చేసుకుని సభ్యత్వం నమోదు చేయించాల్సి ఉంటుంది. అంటే పార్టీపై పట్టు పెంచుకునేందుకు మంచి అవకాశం లభిస్తుంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదును నారా లోకేష్ పర్యవేక్షిస్తారు. ఇటీవల నారా లోకేష్ ఇలా తమ పార్టీకి కోటి మందికిపైగా సభ్యులను చేర్పించారు. ఆయన ప్లానింగ్ అందర్నీ ఆకట్టుకుంది. తెలంగాణలోనూ కేటీఆర్ ఆ బాధ్యత తీసుకుని కోటి మార్క్ దాటిస్తారని అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా హరీష్ రావుకు ఆ బాధ్యతలు ఇచ్చారు.
హరీష్ రావుకు ప్రాధాన్యం పెంచుతున్న కేసీఆర్
ఇటీవల కేసీఆర్ ఇస్తున్న ఆదేశాలను చూస్తే హరీష్ రావుకు అనూహ్య ప్రాధాన్యత లభిస్తుంది. ఏ విషయం అయినా ముందుగా హరీష్ కే బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో ఆయన తరచూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. ప్రతీ విషయంలోనూ హరీష్ దూకుడుగానే ఉంటున్నారు. కేసీఆర్ ఒక్క సారిగా హరీష్ కు ప్రాధాన్యం పెంచడం బీఆర్ఎస్ వర్గాల్లోనూ కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. గతంలో రెండో సారి బీఆర్ఎస్ గెలిచిన తర్వాత హరీష్ రావు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. మంత్రి పదవి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. నెలల తరబడి ప్రగతి భవన్ నుంచి ఆయనకు పిలుపులు వచ్చేవి కావు. ఇప్పుడు ఒక్క సారిగా సీన్ మారిపోయింది.
కేటీఆర్ పై సానుకూలత పెరగడం లేదని భావిస్తున్నారా ?
బీఆర్ఎస్కు సంబంధించి మొత్తం పార్టీ వ్యవహారాలు కేటీఆర్ చూసుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొత్తం ఆయన చేతుల మీదుగానే నడుస్తోంది. రోజుకు రెండు, మూడు చోట్ల ప్రసంగిస్తున్నారు. జిల్లాలు తిరుగుతున్నారు. అయితే పార్టీకి .. కేటీఆర్ కు అనుకున్నంతగా మైలేజీ రావడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. అందుకే కేసీఆర్.. హరీష్ రావుకు ప్రాధాన్యం పెంచుతున్నారని భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని హరీష్ ఉపయోగించుకుంటున్నారు. బీఆర్ఎస్ గెలిస్తే ఎవరు సీఎం అనే ప్రశ్న కు కేసీఆర్ అనే సమాధానాన్ని అన్ని చోట్లా ఇస్తూ.. మరో పేరుకు చోటే లేదని చెబుతూ తన రాజకీయం తాను ప్రారంభించారు.