ఇండియాలో టెస్లా ప్లాంట్ పెట్టాలని ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నారు. ముందుగా కార్లను ఇంపోర్టు చేసి అమ్మబోతున్నారు. తరవాత ప్లాంట్ పెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈవీ పాలసీని మార్చింది. ఈ క్రమంలో పన్నులు తగ్గడంతో ఇంపోర్టు చేసుకుని అమ్మాలని డిసైడయ్యారు. అయితే ప్లాంట్ పెడితేనే అమ్మకాలకు చాన్స్ ఇస్తామని భారత్ షరతు విధించడంతో ప్లాంట్ పెట్టేందుకు మస్క్ రెడీ అయ్యారు.
టెస్లా ప్లాంట్ కోసం.. నాలుగైదు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన .. ఈవీ పాలసీలు మెరుగ్గా ఉన్న పలు రాష్ట్రాల విషయంలో టెస్లా ఆసక్తి చూపిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు టెస్లాను తమ రాష్ట్రానికి ఆహ్వానించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. భూమితో పాటు పారిశ్రామిక రాయితీలు ఇచ్చేందుకు సిద్దపడుతున్నాయి. మస్క్ పెట్టుబడి ప్రకటన చేశారు కానీ.. ప్లాంట్ పెడతారా.. ప్లాంట్ ఎప్పుడు పెడతారు అన్నది మాత్రం చెప్పలేదు.
టెస్లా కోసం తెలుగు రాష్ట్రాలు కూడా గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. కియా కార్ల పరిశ్రమను తీసుకొచ్చినందున.. మరో సారి అలాంటి పెట్టుబడి తీసుకు వస్తే.. ఆటోమోబైల్ హబ్ గా మారే అవకాశం ఉంది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకునే చాన్స్ ఉంది. అయితే గుజరాత్ కూడా రేసులో ఉంది. ఎలాన్ మస్క్ ఏ రాష్ట్రం వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.