భారత దేశంలో ప్రాంతీయ మీడియా, జాతీయ మీడియా అనే తేడా లేకుండా.. ప్రతి మీడియా హౌసూ ఏదో ఒక రాజకీయ వర్గానికి అనుకూలంగానే పనిచేస్తూ ఉన్నాయనేది కాదనలేని సత్యం. కొన్ని పార్టీలకు, రాజకీయ నేతలకు సొంతంగా పత్రికలు, టీవీ ఛానళ్లు ఉన్నాయి. మరికొన్ని వార్తా సంస్థలు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ పబ్బం గడుపుకొంటున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో మీడియా వేసే వేషాలు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని, విసుగును కలిగిస్తూ ఉంటాయి. అభిమానం ఎక్కువైన మత్తులో్ చేసే భజన కామెడీగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు “ఈనాడు’’ పత్రిక కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురించి రాసే కథనాలు ఈ కోవ కే చెందుతున్నాయి!
సాక్షి పత్రిక జగన్ భజన ఉంటుంది. సాక్షి వాళ్లు అధికారికంగా వైఎస్ ఫొటోను లోగోలోనే వేసేసుకున్నారు. ఇక ఈనాడు విషయానికి వస్తే.. ఏపీవరకూ ఇది క్రమంగా తెలుగుదేశం కన్నా బీజేపీ అనుకూలతనే ఎక్కువగా ప్రదర్శిస్తోంది. తెలుగుదేశం పార్టీ వార్తలకు, చంద్రబాబు వార్తలకు ఎక్కడా ప్రాధాన్యత తగ్గడం లేదు కానీ.. వెంకయ్య నాయుడు వార్తలంటే ఈనాడులో కొత్త ఉత్సాహంతో ప్రచురణ అవుతున్నాయి. దీనికి అనేక రుజువులు ఉన్నాయి. ఆ మధ్య రాజ్యసభ సభ్యత్వం విషయంలోనూ.. తాజాగా వెంకయ్య కు సమాచార శాఖను కేటాయించిన నేపథ్యంలోనూ ఈనాడులో ప్రచురణ అయిన వార్తలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
వెంకయ్య నాయుడు తమ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే, కాదు మా రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభకు వెళ్లాలని బీజేపీ కి చెందిన వివిధ రాష్ట్రాల నేతలు పోటీలు పడ్డారని ఈనాడు సెలవిచ్చింది! మధ్య ప్రదేశ్ , రాజస్థాన్, కర్ణాటక.. తదిరత రాష్ట్రాల బీజేపీ నేతలు ఈ విషయంలో పోటీలు పడ్డారని, వెంకయ్యను తాము రాజ్యసభకు పంపుతామంటే, కాదు.. ఆ ఛాన్సు మాకే దక్కాలని వీరు కొట్టుకు చచ్చారన్నట్టుగా అప్పట్లో ఈనాడు పత్రిక రాసింది. అయితే కర్ణాటక బీజేపీలో వెంకయ్యకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడించింది. ప్రతిసారీ వెంకయ్యను మా పై మోపడం ఏమిటి? అని అక్కడి బీజేపీ వాళ్లు నిరసన వ్యక్తం చేశారు. అక్కడ నుంచి నామినేషన్ వేయడానికి వెళ్లిన వెంకయ్య ఆ నిరసనతో వెనుదిరిగాడంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆ సంగతలా ఉంటే.. ఇక తాజాగా వెంకయ్య కు సమాచార శాఖను కేటాయించడాన్ని పండగలా సెలబ్రేట్ చేసింది ఈనాడు సంస్థ. వెంకయ్యకు మోడీ బృహత్తరబాధ్యతలు ఇచ్చారని.. భారమంతా వెంకయ్య మీద పెట్టారని.. ఈ విషయం గురించి విదేశీ పర్యటనలో ఉన్న వెంకయ్య కు మోడీ ఫోన్ చేసి ఇరవై నిమిషాల పాటు మాట్లాడరని.. అంటూ ఒక కథనాన్ని ఇచ్చింది. మరి అదనంగా శాఖ కేటాయించినంత మాత్రన మరీ ఇంతలా మోసేయ్యాలా.. వెంకయ్య మీదే మోడీ ఆధారపడిపోయారని.. డబ్బా కొట్టాలా? అనేది సగటు పాఠకుడికి వచ్చే సందేహం!