తెలుగు360 రేటింగ్: 2.25/5
ఈమధ్య చిన్న సినిమాల్లో కాస్త గట్టిగా వినిపించిన పేరు ‘బాపూ’. కారణం… బ్రహ్మాజీనే. ‘నాకు ఈ కథ బాగా నచ్చింది. అందుకే పారితోషికం తీసుకోకుండా నటించా’ అని సగర్వంగా ప్రకటించారు బ్రహ్మాజీ. అంతేకాదు.. ఈ సినిమా ప్రమోషన్ అంతా తన భుజాలపై వేసుకొని నడిపించారు. తన పరిచయాల్ని వాడుకొని, ప్రీ రిలీజ్ ఫంక్షన్ మొత్తం అతిథులతో నింపేశారు. తన అనుభవంపై నమ్మకమున్న ప్రేక్షకులు ‘ఈ సినిమాలో ఏదో ఉండి ఉంటుందిలే.. లేదంటే బ్రహ్మాజీ ఎందుకింత కష్టపడతాడు’ అనుకొన్నారు. పైగా ‘బలగం’ ఛాయలు టీజర్, ట్రైలర్లో కనిపించాయి. చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తున్న రోజులు ఇవి. ఏ పుట్టలో ఏపాముందో ఎవరికి ఎరుక..? అందుకే ఈ సినిమాని కాస్త సీరియస్గా తీసుకొన్నారు జనాలు. మరి… బ్రహ్మాజీ నమ్మకం నిజమైందా? ఆయన అనుభవం ఎంత మేర పనికొచ్చింది? ఇంతకీ ఈ ‘బాపూ’ ఏం చెప్పదలచుకొన్నాడు?
తెలంగాణలోని ఓ గ్రామం. అక్కడ మల్లయ్య (బ్రహ్మాజీ) పత్తి రైతు. వరుసగా మూడేళ్లు పంట వేసి నష్టపోతాడు. అప్పుల బాధ ఎక్కువ అవుతుంది. ఈసారి పంట పండినా, పాత బాకీల కింద జమ చేయాల్సిందే. మరోవైపు కొడుకు కొత్త ఆటో కావాలని ఇంట్లో పోరు పెడుతుంటాడు. కూతురు (ధన్య బాలకృష్ణ)కు పెళ్లి చేయాలి. ఇలాంటి దశలో చేతికొచ్చిన పంట.. వాన పాలవుతుంది. అప్పుల వాళ్లకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో ఆత్మహత్యే శరణ్యం అని భావిస్తాడు మల్లయ్య. తాను చచ్చిపోతే రైతు భీమాకింద వచ్చే రూ.5 లక్షలు తన కుటుంబానికి పనికొస్తాయని అనుకొంటాడు. అయితే ఆ ఆత్మహత్య ప్లాన్ వర్కవుట్ కాదు. ‘మీరు చనిపోవడం ఎందుకు.. మీ బాపూ చనిపోయినా డబ్బులు వస్తాయి కదా’ అని భార్య (ఆమని) సలహా ఇస్తుంది. అప్పుడు మల్లయ్య ఏం చేశాడు? బాపు (సుధాకర్ రెడ్డి) కథేమిటి? అదే ఊర్లో ఉండే రాజు (రచ్చరవి) కి ఓ బంగారు విగ్రహం దొరికినట్టే దొరికి మిస్ అవుతుంది. ఆ విగ్రహం కథేమిటి? ఇదంతా తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
టీజర్, ట్రైలర్లో ‘బలగం’ ఛాయలు కనిపించాయి. అయితే ఆ కథ వేరు. ఆ కథ వేరు. కాకపోతే.. ఫార్మెట్ మాత్రం అదే ఫాలో అయ్యాడు దర్శకుడు. తెలంగాణలో పల్లెటూరు, అక్కడ తండ్రి చావు చుట్టూ అల్లిన ఎమోషన్, వాళ్ల మధ్య ఓ ప్రేమకథ.. ఇలా అంశాలు మాత్రం అవే కనిపిస్తుంటాయి. మల్లయ్య అనే రైతు కష్టాలు, అతని అప్పుల బాధ, కుటుంబ నేపధ్యం చూపిస్తూ కథని మొదలు పెట్టాడు దర్శకుడు. ఈ కథలో రెండు ఉప ప్రేమకథలు ఉన్నాయి. ఒకటి ధన్య బాలకృష్ణ – అవసరాల శ్రీనివాస్ది అయితే.. రెండోది ఆటోవాలా, ఆకతాయి అమ్మాయి ప్రేమకథ. అయితే ఈ రెండు కథల వల్ల అసలు కథకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదు. ముఖ్యంగా ఆటోవాలా లవ్ స్టోరీ ‘బేబీ’ కథని తలపిస్తుంది. ఈ ప్రేమ జంట కోసం ఓ పాట కూడానూ.
మల్లయ్య ఇంటి నేపథ్యంలో కావల్సినంత డ్రామా ఉంది. తండ్రి చనిపోతే, భీమా డబ్బులు వస్తాయని ఆశ పడడం, అందుకు తండ్రి కూడా ఒప్పుకోవడం, చివరి రోజుల్లో తండ్రిని బాగా చూసుకోవాలని తాపత్రయపడడం, `ఈరోజు చస్తాడా, రేపు చస్తాడా` అని ఎదురు చూడడం.. ఇవన్నీ లైటర్ వేన్లో వర్కవుట్ అయిన అంశాలు. అయితే.. ఇక్కడ దర్శకుడు ఎమోషన్ని మరింత వర్కవుట్ చేయాల్సింది. విగ్రహం చుట్టూ నడిపిన కథ తొలుత ఆసక్తిగానే అనిపిస్తుంది. అయితే అది శుభం కార్డు కోసం ఎంచుకొన్న ఎత్తుగడ అని అర్థమయ్యేక… విగ్రహం ఏమవుతుందో? చివరికి ఎవరి చేతికి చిక్కుతుందో తెలిసిపోతూనే ఉంటాయి. ధన్య బాలకృష్ణ లవ్ స్టోరీ విచిత్రంగా ఉంటుంది. తను ప్రేమని కాదనడానికి రీజన్ ఏమిటి? అనేది అర్థం కాదు. ఇలా ఫోర్డ్స్ ఎమోషన్స్ ఎక్కువుగా కనిపించాయి. ఏ సన్నివేశం సహజంగా ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకుపోయేలా ఉండదు. ఐడియా పరంగా బాగున్న కథ ఇది. దానికి గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్ తోడైతే.. ‘బలగం’లా గుర్తుండిపోయేది. ఆ విషయంలో వెనుకబడింది. లేదంటే ఫలితం వేరేలా ఉండేది.
బ్రహ్మాజీ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. బహుశా.. నటుడిగా తనకో మైల్ స్టోన్ అవుతుందని భావించారేమో..? నిడివి పరంగా, ప్రాధాన్యత పరంగా కీలకమైన పాత్ర ఇది. కాకపోతే.. ఆయనలోని నటుడు పూర్తి స్థాయిలో బయటకు రాలేకపోయాడు. ఆర్ట్ సినిమాలో హీరోలా.. నిదానంగా, నీరసంగా కనిపించడానికి ప్రయత్నించారు. అదెందుకో అర్థం కాలేదు. ఆమని రాంగ్ ఛాయిస్ లా అనిపిస్తుంది. ఆమె స్లాంగ్ సరిగా అతకలేదు. తాత పాత్రకు సుధాకర్ జీవం పోశారు. ధన్య పాత్రకు తగ్గట్టుగా మారిపోయింది. అవసరాలది అతిథి పాత్ర. అసలు ఆ పాత్రకు సరైన డైలాగులే రాయలేదు. రచ్చరవికు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర పడింది. తను హాస్యాన్ని వదిలి సీరియస్ పాత్రలవైపు దృష్టి పెట్టడం ఆహ్వానించదగిన పరిణామం.
సంగీతం హాయిగా ఉంది. ముఖ్యంగా పాటల్లో సాహిత్యం చెవులకు చేరింది. పంట చేను గురించి చెప్పే పాటలో సాహిత్యం మరింత బాగా కుదిరింది. ఎడిటింగ్ కూడా షార్ప్ గానే ఉంది. రెండు గంటల్లో ముగిసిన కథ. కొత్త పాయింట్ పట్టుకొన్న దర్శకుడు, దాన్ని జనరంజకంగా తీర్చిదిద్దడంలో తడబడ్డాడు. ఈ సినిమాను లైటర్ వేన్లో చెప్పాలా? సీరియస్ టోన్లో చెప్పాలా? అనే మీమాంశలో అటూ ఇటూ ఊగిసలాడాడు. నిజంగా ఈ సినిమాని సీరియస్ టోన్లో, ‘రా’గా చెప్పి ఉంటే మంచి సినిమాగా మిగిలిపోయేది. బ్రహ్మాజీ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కేది.
తెలుగు360 రేటింగ్: 2.25/5