చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ కష్టాల్లో ఉందని, ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వకపోవడంతో రిలీజ్ డేట్ సందిగ్థంలో పడిందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి ఓటీటీ సంస్థలు ఈ సినిమా విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదు. నిర్మాతకూ, ఓటీటీలకూ సరైన డీల్ కుదర్లేదు. ఓటీటీలు ఈమధ్య పెద్ద సినిమాలకు సైతం గీచి గీచి బేరాలు ఆడుతుండడంతో విశ్వంభర బేరం తెగలేదు. యూవీ నిర్మాతలేమో ఈ సినిమా ఓటీటీ డీల్ రూ.75 కోట్లకు సెట్ అవుతుందన్న ఆశతో ఉన్నారు. ఓటీటీ సంస్థలు అక్కడి వరకూ రావడం లేదు. టీజర్ కాస్త అటూ అటుగా ఉండడంతో.. ఓటీటీ అమ్మకం మరింత కష్టమైంది.
అయితే ఇప్పుడు మళ్లీ విశ్వంభర ఓటీటీ బేరాలు మొదలయ్యాయి. ఓటీటీ నుంచి దాదాపు రూ.65 కోట్లకు బేరం వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మంచి రేటే. కానీ… యూవీ మాత్రం మరో రూ.10 కోట్లు ఎక్కువ అడుగుతోంది. త్వరలో ఈ సినిమా నుంచి ఓ పాట విడుదల చేయబోతున్నారు. ఆ పాటలో విజువల్స్ బాగుంటాయట. పాట కూడా బాగా వచ్చిందని టాక్. ఈ పాట వచ్చాక… ఓటీటీ సంస్థలు రేటు పెంచుతాయని, అప్పుడు కనీసం రూ.70 కోట్లకు ఈ డీల్ సెట్ చేయొచ్చని యూవీ భావిస్తోంది. హిందీ రైట్స్ రూ.38 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇది కూడా మంచి బేరమే. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ పాటని తెరకెక్కించారు. మరో పాట బాకీ ఉంది. అది కూడా పూర్తయితే… షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టేస్తారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.