నక్కిన త్రినాథరావు సినిమా ‘ధమాకా’లో పాటలన్నీ హిట్టే. అందులో బుల్లెట్ బండి పాట మరీ గుర్తుండిపోతుంది. ఆ పాటకు థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. నిజానికి భీమ్స్ పాట కాదది. ఓ ప్రైవేటు ఆల్బమ్‌లోని పాట. దాన్ని సందర్భానికి తగ్గట్టుగా వాడుకొన్నారు. అది సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అదే పని చేశాడు త్రినాథరావు. ప్రైవేటు గీతాల్లో బాగా పాపులర్ అయిన ‘చిన్నా రాములమ్మా’ పాటని తన కొత్త సినిమా ‘మజాకా’ కోసం వాడుకొన్నాడు. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన సినిమా ఇది. ఇందులోని ‘చిన్నా రాములమ్మా’ పాటని ఈ రోజు విడుదల చేశారు. మొత్తం వీడియో సాంగ్ బయటకు వచ్చేసింది. పాట ఆల్రెడీ హిట్ కాబట్టి.. దాని గురించి కొత్తగా చెప్పుకొనేది లేదు. ఈ పాట విననివాళ్లకు మాత్రం కచ్చితంగా కిక్ ఇచ్చేస్తుంది. ధియేటర్లో ఈ పాటకు మంచి మైలేజీ వస్తుందని చిత్రబృందం నమ్ముతోంది. రేవంత్ ఈ పాటని పాడాడు. పాత పాటే అయినా, సినిమాకు తగ్గట్టుగా అక్కడక్కడ కొన్ని మార్పులు చేశారు ప్రసన్న కుమార్ బెజవాడ.
ఈ సినిమాలోని పాటలన్నీ బాగానే పాపులర్ అయ్యాయి. ‘బేబీమా’, ‘పగిలీ’, ‘బ్యాచిలర్ ఆంథమ్’ పాటలు క్లిక్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్ కూడా చేరింది. ఆడియో పరంగా ‘మజాకా’ హిట్ సినిమా అనిపించుకొంది. మరి… థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ శివరాత్రికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ముందే క్లోజ్ అయిపోవడంతో ఈ సినిమా విడులకు ముందే సేఫ్ జోన్లో పడిపోయింది. శివరాత్రికి మరో సినిమా పోటీ లేదు కాబట్టి – సందీప్‌కు ఇది బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు.