చిరంజీవి తల్లి అంజనాదేవి ఆరోగ్యం బాగా లేదని, ఆమెని ఆసుపత్రిలో చేర్చారని కొన్ని టీవీ ఛానళ్లు, వెబ్ సైట్లు కథనాల్ని ప్రసారం చేశాయి. దీని పై చిరంజీవి స్పందించారు. ”మా అమ్మ అస్వస్థతగా ఉందని, ఆసుపత్రిలో చేరిందని కొన్ని మీడియా కథనాలపై నా దృష్టి పడింది. రెండు రోజులుగా ఆమె కాస్త అస్వస్థతకు గురైందని వైద్యులు చెప్పారు. ఆమె ఇప్పుడు హుషారుగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత నివేదికలను ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి” అంటూ ఓ ట్వీట్ చేశారు. దాంతో ఈ ఊహాగానాలకు తెరపడినట్టైంది.
చిరంజీవి తల్లి అంజనాదేవి వయసు దాదాపు 87 ఏళ్లు. ఆమె చలాకీగానే ఉండేవారు. ఇంట్లో అన్ని పనులూ తానే దగ్గరుండి చేసుకొంటారు. వంట కూడా ఆమే స్వయంగా చేస్తారు. అయితే వయసు పైపడడంతో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అందుకే ఇటీవల ఆమెకు కొన్ని కీలకమైన పరీక్షలు చేశారని సమాచారం. ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదురుగానే ఉందని తెలుస్తోంది.