తమిళ రాజకీయాల్లో హిందీ నిప్పులు పోస్తోంది. త్రిభాషా విద్యా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ఇంగ్లిష్ ఓకే కానీ హిందీని మాత్రం మా మీద రుద్దవద్దని హెచ్చరికలు చేస్తోంది. సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా ఈ అంశంపై ఉద్యమం ప్రారంభించారు. గెట్ అవుట్ హిందీ అనే డీఎంకే స్ట్రాటజీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి పోటీగా బీజేపీ గెటౌట్ స్టాలిన్ పేరుతో ట్విట్టర్ ట్రెండింగ్ చేసింది. ప్రధాని మోదీ కూడా ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. మాతృభాషల మధ్య శతృత్వం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.
తమిళనాట అనాదిగా హిందీపై వ్యతిరేకత
హిందీ వ్యతిరేకత అనేది తమిళనాడులో ఎప్పటి నుంచో ఉంది. తనపై హిందీ రుద్దితే తమ మాతృభాషకు సమస్యలు వస్తాయని.. ఉత్తరాదీకరణ చేయడానికి ప్రయత్నమని దశాబ్దాలుగా అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు తమిళంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు. అయితే దాన్ని హిందీ వ్యతేరికతగా మార్చడంలో అక్కడి రాజకీయ పార్టీలు ఓ విధానంగా పెట్టుకున్నాయి. ఫలితంగా హిందీ అనేది తమిళనాడులో ఓ వివాదాస్పద రాజకీయ అంశంగా మారింది.
భాషను రాజకీయంగా వాడేసుకుంటున్న తమిళ పార్టీలు
కేంద్రంపై వ్యతిరేకతను చూపించడానికి తమిళనాడు పార్టీలు భాషను ఆయుధంగా చేసుకుంటున్నాయి. దీని వల్ల హిందీపై విద్వేషం పెరుగుతోంది. హిందీ మాట్లాడేవారి పట్ల వ్యతిరేకత చూపించేవారు తమిళనాడులో పెరుగుతున్నారు. హిందీ మాట్లాడేవారు ఉంటే తమ రాష్ట్రంలో ఉత్తరాది, జాతీయ పార్టీలు పెత్తనం చేస్తాయని ప్రజలకు నూరిపోస్తూంటారు. సందర్భం దొరికినప్పుడల్లా దీన్ని రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో నిప్పులు చెరుగుతోది.
మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ నేర్చుకోవాలంటున్న త్రిభాషా విధానం
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విద్యావిధానంలో మాతృభాషను నిర్లక్ష్యం చేయమని చెప్పలేదు. మాతృభాషలోనే ప్రాథమికంగా చదువు చెబితే పిల్లల మానసిక వికాసం వస్తుందని చెప్పింది. అయితే హిందీ, ఇంగ్లిష్ కూడా సబ్జెక్టులుగా పెట్టింది. దేశవ్యాప్తంగా ఎక్కడా ఈ అంశంపై వ్యతిరేకత లేదు. తమిళనాడులో మాత్రం తాము హిందీ నేర్చుకునేది లేదని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. హిందీ నేర్చుకోవడం వల్ల తమిళ భాషకు ఎలాంటి నష్టం జరగదని నిపుణులు చెబుతున్నా.. అక్కడి రాజకీయ పార్టీలు మాత్రం ..మంటలను రాజేస్తూ పోతున్నాయి.