సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యూటర్న్ తీసుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన రేవంత్ రెడ్డిని కలిశారు. తాను కాంగ్రెస్ లోనే ున్నాన్న సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తనకు ఎలాంటి గౌరవం లభించడం లేదని.. బీఎస్పీ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన ఆయన.. ఇక నుంచి స్వతంత్రంగా ఉంటానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నేతలు కళ్లు తెరిచారు. కొద్ది రోజులుగా ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఎవరూ అసలు సమస్య ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.కానీ హఠాత్తుగా ఆయన తాను ఇక స్వతంత్రంగా ఉంటానని చెప్పడంతో కంగారు పడ్డారు.
కోనేరు కోనప్ప మొదట కాంగ్రెస్ నేతనే. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ టిక్కెట్ రాలేదని బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో ఆయనకు మంచి ఆదరణ లభించింది కానీ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరడంతో ఆయనకు ఉక్కపోత ప్రారంభమయింది. తనకు ఇక సీటు గ్యారంటీ ఉండదనుకున్న ఆయన కాంగ్రెస్ లో చేరారు. కానీ ఆయన నియోజకవర్గంలో మరో కాంగ్రెస్ నేత దండె విఠల్ రాజకీయం చేస్తున్నారు. దాంతో కోనప్పకు రాజకీయం చేసే చాన్స్ దొరకలేదు.
గతంలో తాను ప్రారంభించిన.. పూర్తి చేయాల్సిన పనులను అయినా చేయించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క పని కూడా కాలేదు. అందుకే బయటకు వెళ్లిపోయారు. కేసీఆర్ ను పొగిడి మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లాలనుకున్నారు. కానీ ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడి.. కాంగ్రెస్ లో ప్రాధాన్యం దక్కుతుందని భరోసా ఇచ్చి.. సీఎంను కలిసేలా చేయగలిగారు.