తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ పన్నుల్లో జరిగిన ప్రమాదం విషయంలో సహాయ చర్యల గురించి ఆయన ఆరా తీశారు. ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ పన్నులు జరుగుతున్న సమయంలో ఒక్క సారిగా పై కప్పు కుప్పకూలిపోయింది. దీంతో ఎనిమిది మంది కూలీలు లోపల ఇరుక్కుపోయారు. మొత్తం యాభై మంది వరకూ టన్నెల్ లోకి వెళ్లారు. అయితే నలభై రెండు మంది బయటకు వచ్చారు. మరో ఎనిమిది మంది లోపలే ఉండిపోయారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహా పలు బృందాలు వారిని కాపాడేందుకుప్రయత్నిస్తున్నాయి. మొత్తంగా మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నాగర్ కర్నూలుజిల్లాకు చేరుకున్నాయి. రేవంత్ కు ఫోన్ చేయక ముందే ప్రధాని మోదీ ఈ అంశంపై వివరాలు తెలుసుకున్నారు. సహాయ చర్యలపై కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా తాము తీసుకుంటున్న చర్యలను రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు కొంత కాలం క్రితం నిలిపోయాయి. వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నాలుగు రోజుల కిందటే పనులు ప్రారంభించారు. ఈ లోపే ఈ ప్రమాదం జరిగింది. ఆ కార్మికుల్ని సేఫ్ గా బయటకు తీసుకు వచ్చేందుకు అన్నిప్రయత్నాలు చేస్తున్నారు.