ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించాలా.. పొగడాలో అర్థం కావడం లేదు. విమర్శిస్తే ఓ బాధ.. పొగిడితే మరో బాధ. అందుకే ఆయన కొత్త పలుకులు ఎప్పటికప్పుడు వింతగా మారుతున్నాయి. ఇటీవలి కాలం వరకూ చంద్రబాబులో.. పాత చంద్రబాబు కనిపిస్తున్నారని.. అప్పట్లో ఐటీ అంటే.. ఇప్పుడు ఏఐ జపం చేస్తున్నారని విమర్శించేవారు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని జగన్ వ్యవహారంతో పోల్చి అలా చేయడం లేదంటున్నారు. జగన్ చేసినట్లుగానే చంద్రబాబు ఇద్దరికీ తేడా ఏముంటుందని వచ్చే ప్రశ్నలకు తర్వాత సమాధానాలు చెప్పుకోలేరని ఆయన అర్థం చేసుకోలేకపోయేవారు. ఇప్పుడు హఠాత్తుగా టోన్ మార్చారు.. చంద్రబాబు చాణక్యం ఇదే.. అనుభవానికి, ఆవేశానికి ఉన్న తేడా ఇదే అని పొగడ్తలు అందుకున్నారు.
ఈ వారం కొత్త పలుకు అంతా చంద్రబాబు గురి చూసి వంశీనికొట్టారని త్వరలో మరికొందర్నికొడతారని.. ఎవరికీ ప్రజాభిమానం రాకుండా.. జగన్ రెడ్డి కూడావారిని పరామర్శిస్తే.. ప్రజల్లో పరువుపోయేలా చేసి.. చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆర్కే పొగిడేశారు. అసలు వాస్తవంగా అయితే.. వల్లభనేని వంశీ ఆ ఫిర్యాదుదారుడ్ని గెలుక్కోకపోతే ఇప్పటికి హాయిగా మైహోమ్ భూజాలోని లగ్జరీ ఆపార్టుమెంట్ లో చల్లగా ఉండేవారు. హైకోర్టు ముందస్తుబెయిల్ కొట్టేసినా.. పోలీసులు అరెస్టు చేసేవారు కాదు. కానీ.. వంశీ గెలుక్కోబట్టే అరెస్టయ్యాడు. అంతే కానీ ఇక్కడ చంద్రబాబు గురి చూసి కొట్టిందేమీ లేదు. ఇంకా చెప్పాలంటే.. అసలు అలాంటివి ఇంకా ప్రారంభించలేదు. ప్రారంభిస్తారో లేదో తెలియదు.
అరెస్టులు చేస్తే ఏమి వస్తుంది.. మహా అయితే ఓ రెండు, మూడు వారాలు లోపలుండి బయటకు వస్తారు. కానీ అరెస్టు చేస్తారన్న భయం పుట్టించడమే అసలైన విజయం అనుకోవచ్చు. జగన్ రెడ్డి మళ్లీ తన విధ్వంస రాజకీయం కోసం తెరపైకి వస్తున్నారని ఆర్కే చెబుతున్నారు.దాన్ని కూడా చంద్రబాబు ఎక్స్ పోజ్ చేస్తున్నారని .. విజయవాడ,. మిర్చియార్డుల ఘటనల సమయంలో టీడీపీ సోషల్మీడియా .. యాక్టివ్ గా చేసిన ప్రచారం గురించి ఆర్కే చెప్పారు. చిన్నపిల్లతో చేసిన రాజకీయాలు.. మిర్చియార్డులో ఆడిన డ్రామాలు అన్నీ ప్రజలకు తెలిసిపోయాయని ఆర్కే అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి తాను డ్రామాలు ఆడుతున్నానని తనకు తెలుసు. చూసేవారికి తెలుసు.కానీ ఆయన స్ట్రాటజీ వేరు. ఏం చేసినా గుడ్డిగా నమ్మేవారంటారు. అందుకే ఆయన డ్రామాలు. ఈ లెక్కలను ఆర్కే అర్థం చేసుకోలేకపోయారు. ఆర్కేకు ఇప్పటి రాజకీయాలు అర్థం కావడం లేదో.. లేకపోతే అవసరాల కోసం రాయాల్సి వస్తుందో కానీ ఇటీవలి కాలంలో కొత్త పలుకులన్నీ కాస్త తేడాగానే ఉంటున్నాయి. ఫెయిర్ గా ఉండటం లేదు. ఆ ఫీల్ మాత్రం రెగ్యులర్ గా ఆయన ఫీచర్ ఫాలో అయ్యే వాళ్లకు అర్థమవుతుంది.