గ్రూప్ 2 పరీక్షల్ని యథావిధిగా నిర్వహిస్తున్నారు. వాయిదా వేయాలంటూ కొంత మంది ఆందోళనలు చేశారు. అయితే నిబంధనల ప్రకారం పరీక్ష జరిగి తీరుతుంది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీ ప్రభుత్వం సూచనను కూడా పట్టించుకోలేదు. అయితే వాయిదాలు అనే మాట ఎప్పటికీ మంచిది కాదు. గ్రూప్ టు రాసేవాళ్లందరూ మూకుమ్మడిగా వాయిదా కోరడం లేదు. 90 శాతం మంది పరీక్ష యథావిధిగా జరగాలని కోరుకున్నారు. కానీ అభ్యర్థులకు ఆశ రేపడమే ఇక్కడ అసలు సమస్య.
పరీక్షల వాయిదా డిమాండ్ ఓ రొటీన్
ప్రభుత్వాలు ఉద్యోగుల్ని నియమించుకోవడం తక్కువ అయిపోయింది. నోటిఫికేషన్లు వచ్చినా అనేక రకాల న్యాయపరమైన సమస్యలు. వాటికి తోడు నిరుద్యోగులు పరీక్ష దగ్గరకు వస్తుందంటే చాలు వాయిదా డిమాండ్ ఎత్తుకుంటున్నారు. ఈ రోజున పరీక్ష జరుగుతుందని ఆరు నెలల ముందే తెలిసినా సరే ఈ వాయిదాల రాజకీయం కొనసాగించారు. తెలంగాణలో అదే జరిగింది. ఏపీలో అదే జరుగుతుంది. ప్రభుత్వాలు వీరి డిమాండ్లకు తలొగ్గితే భవిష్యత్ లో మరింత మంది అదే పని చేస్తారు. అందుకే ఇలాంటి వాయిదాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకూడదు. ఇప్పుడు పరీక్ష జరగడం కూడా మంచిదే.
కుదరదని ఖరాఖండిగా చెప్పాల్సింది !
అయితే పరీక్ష వాయిదా విషయంలో డిమాండ్ చేస్తున్న వారికి ఆశలు రేపడమే అసలు సమస్య. రెండు మూడు రోజుల నుంచే పరీక్ష వాయిదాకు ప్రయత్నిస్తామన్న సంకేతాలు ప్రభుత్వం నుంచి వచ్చాయి. న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తామని లోకేష్ చెప్పారు కానీ వాయిదా వేస్తామని చెప్పలేదు. అయితే లోకేష్ అలా అన్నారంటే ఖచ్చితంగా వాయిదా పడుతుందని అనుకున్నారు. చంద్రబాబు లేఖ రాశారు.. ఆడియోకూడా వెలుగులోకి వచ్చింది. అయినా ఏపీపీఎస్సీ చైర్మన్ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఓ క్లారిటీ ఏపీపీఎస్సీ వైపు నుంచి ఉన్నప్పుడు.. ప్రభుత్వం కూడా సాధ్యం కాదని నేరుగా చెప్పాల్సింది.
పదవులు ఇచ్చిన వారు మాట వినడంలేదని ప్రభుత్వానికే చులకన
ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ పదవిని ప్రభుత్వమే ఇచ్చింది. అయినా ప్రభుత్వం మాట వినలేదని.. ఆమెపై టీడీపీ క్యాడర్ గుర్రుమంటుంది. కానీ భవిష్యత్ లో చాలా నిర్ణయాలను ఏపీపీఎస్సీ తీసుకోవాల్సి ఉంది. గతంలో జరిగిన అక్రమాలు, గ్రూప్ వన్ వ్యవహారాలు ఉన్నాయి. వాటన్నింటినీ బయటకు తీస్తే చాలా మంది జాతకాలు తేలుతాయి. ప్రభుత్వం ప్రమేయం లేదని.. స్వతంత్రంగానే అన్నీ బయటకు వచ్చాయని ప్రజల ముందు వాదించడానికైనా ఇలాంటి నిర్ణయాలను ఎపీపీఎస్సీ చైర్మన్ తీసుకోవచ్చు. ఇప్పుడు కాకపోతే తర్వాత ఆమె నియామకం మంచిదేనని చెప్పుకోవచ్చు.కానీ ఇప్పటికైతే ప్రభుత్వానికి పట్టు లేదని విమర్శలు ఎదుర్కోక తప్పదు.