అనర్హతా వేటు నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి తాను..తన ఎమ్మెల్యేలు ఒక్క రోజు అయినా అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నారు. ఇలా వెళ్లడం అంటే.. పిరికితనానికి.. పనికి మాలిన రాజకీయానికి నిలువెత్తు రూపమని అంటారని తెలిసినా ఆయన తగ్గలేదు. వెళ్లాలనే అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు తాను ఇలా తగ్గకపోతే రేపు తన పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల కౌంట్ జీరో అయిపోతుంది. చివరికి పులివెందులలో తాను కూడా నెగ్గడం దాదాపుగా అసాధ్యం అవుతుంది. అందుకే ఎవరేమనుకున్నా… తనపై .. తన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడకుండా చూసుకోవాలని జగన్ అనుకుంటున్నారు.
వైసీపీ తరపున గెలిచినవారిలో పలువురు అతి స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపఎన్నికలు వస్తే వారెవరూ గెలవలేరు. ఎర్రగొండపాలెంలో ఐదు వేల ఓట్లు, దర్శిలో రెండు వేల ఓట్లు, బద్వేలులో పదిహేను వేలు, రాజంపేటలో ఏడు వేలు, మంత్రాలయంలో పదివేలు, ఆలూరులో రెండు వేల ఓట్లు, తంబళ్లపల్లెలో పదివేలు, పుంగనూరులో ఏడువేల ఓట్ల తేడాతో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. రెండు గిరిజన నియోజకవర్గాలు అరకు, పాడేరుల్లో పాతికవేలకుపైగా మెజార్టీ వచ్చింది.. అలాగే పులివెందులలో జగన్ అరవై వేల ఓట్ల మెజార్టీ సాధించారు.
అధికారం లేకపోతే ఉపఎన్నికల్లో గెలుపు ఎంత కష్టమో… నంద్యాల ఉపఎన్నికలు వైసీపీకి పాఠం నేర్పాయి. నంద్యాల ఉపఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి పది రోజుల పాటు ప్రతీ వీధికి తిరిగారు. అయినా పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ఉపఎన్నికలు వస్తే.. జగన్ తన నియోజకవర్గాన్ని కూడా కాపాడుకోవడం కష్టం. ఆయన పాలనా నిర్వాకం కూడా దీనికి కారణం. వైసీపీలోని కింది స్థాయి క్యాడర్ వరకూ జగన్ అరాచకానికి బలయ్యారు. పులివెందులలో క్యాడర్ అంతా అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం చల్లని చూపు లేకపోతే వారు ఇంకా నష్టపోతారు. ఉపఎన్నికల్లో జగన్ కు వారు హ్యాండివ్వడానికి రెడీగా ఉన్నారని సులువుగానే అర్థమవుతుంది.
ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియకేం కాదు. తెలుసు కాబట్టే ఉపఎన్నికలు అంటూ వస్తే తన పార్టీ జీరో అవుతుంది కాబట్టి ఆయన .. కాళ్ల బేరానికి వచ్చేస్తున్నారు.