తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక లిట్మస్ టెస్టుగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు అది సిట్టింగ్ సీటు . ఆ సీటులో గెలిచి తీరాల్సిన అవసరం పడింది. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పరిధిలోని గ్రాడ్యూయేట్ ఓటర్లు ఓట్లు వేయనున్నారు. అయితే ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే సగం మంది ఓటర్లు ఉన్నారు. అందుకే కాంగ్రెస్ తరపున బాధ్యతల్ని పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తీసుకున్నారు. వారి చాయిస్ మేరకే అభ్యర్థిని ఖరారు చేశారు.
భారత రాష్ట్ర సమితి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే ఆ పార్టీ తరపున కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ నామినేషన్ వేశారు. కానీ స్వతంత్రంగా బరిలో నిలబడ్డారు. ఆయన కూడా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించిన మరో విద్యావేత్త బీస్పీ తరపున బరిలో ఉన్నారు. ఇక బీజేపీ తరపున మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డికి చాన్సిచ్చారు. ఆయనకు ఆర్థిక బలం ఉంది. దాంతో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ బరిలో లేకపోవడం ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్ అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ అధికారికంగా ఎవరికీ మద్దతు కూడా ప్రకటించలేదు.
పట్టభద్రుల ఎమ్మెల్సీని కాంగ్రెస్ గెలుచుకోవడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అత్యవసరం. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని ప్రచారం ఆన్ లైన్ విస్తృతంగా చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఓ రకంగా ఇది సర్వే రిజల్ట్ లాంటిదని అనుకోవచ్చు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే మరింత ధీమాగా నిర్ణయాలు తీసుకోవచ్చు. బీఆర్ఎస్ ను ఎదుర్కోవచ్చు. బీజేపీ గెలిస్తే మాత్రం రాజకీయం చాలా మారిపోతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయం మారిపోతుంది. బీఆర్ఎస్ మరింత నష్టపోతుంది.