అమరావతి నగరంతో పాటు రింగ్ రోడ్ కూడా సమాంతరంగా నిర్మించేందుకు అవసరమైన పనులన్నీ చకచకా సాగుతున్నాయి. ఓఆర్ఆర్ వెళ్లే ఐదు జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా 189.9 కిలోమీటర్ల మేర ఈ రింగ్‌రోడ్డు నిర్మాణం కానుంది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఈ రింగ్ రోడ్ ఉంటుంది.
మూడు ఎలైన్మెంట్లను NHAI సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పుచేర్పులు, లింక్‌రోడ్ల ఎలైన్మెంట్ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అక్కడ తుది ఆమోదం తెలుపుతారు. ఓఆర్ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీచేస్తారు. 21 రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో జేసీలు సమావేశాలు నిర్వహించి పరిష్కరిస్తారు.
అదే టైమ్ లో క్షేత్రస్థాయిలో జాయింట్ మెజర్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు. భూసేకరణ జరుగుతుండగానే 3డీ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అంటే ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం అధీనంలోకి వెళ్లినట్లవుతుంది. భూసేకరణ నిధులు ఎన్హెచ్ఏఐ అందజేస్తే భూమికి సంబంధించిన యజమానులకు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తారు. తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇవన్నీ ఆరేడు నెలల్లో పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం కానుంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి ఎలా ఉపయోగపడిందో అమరావతి అభివృద్ధికి కూడా ఈ రింగ్ రోడ్ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.