కూటమి ప్రభుత్వాన్ని కాకా పట్టాలనో మరో కారణమో .. ఆ సంస్థ ఏపీకి రాకపోతే అప్పుడు ఇంకా ఎక్కువ వ్యతిరేక ప్రచారం చేయవచ్చనేమో కానీ కొన్ని మీడియా సంస్థలు అతి ప్రచారం చేస్తున్నాయి. టెస్లా ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే ఎక్కడ పెట్టాలన్నది నిర్ణయించుకోలేదు. గతంలోలా ఇప్పుడు ప్రభుత్వాలు లేవు. తమ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావాలని అన్ని రాష్ట్రాల పాలకులూ ప్రయత్నిస్తున్నారు. గతంలో అయితే పెట్టుబడి పెడతామని వస్తే వాటా ఎంతిస్తారా అని అడిగేవారు. ఇప్పుడు వాటాల గురించి కాకుండా.. రాయితీల గురించి మాట్లాడుతున్నారు.
కియా పరిశ్రమ రావడానికి చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో రాయితీలు ఇచ్చింది. ఆ రాయితీలు భారం అంటూ వైసీపీలో మంత్రిగా చేసిన బుగ్గన వంటి వారు మాట్లాడారు. కానీ దేశవ్యాప్తంగా కియా కార్లు మేడిన్ అనంతపురం తిరుగుతున్నాయి. ఇక్కడే టాక్స్ లు కడుతున్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిలభిస్తుంది. అనుబంధ పరిశ్రమలు భారీగా రావాల్సి ఉన్న వైసీపీ తీరు వల్ల అన్నీ కర్ణాటకలో పెట్టారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అనుకూలమైన భూమితో పాటు పోర్టు లింకేజీని కల్పించే ఆఫర్లు ఇస్తోంది.
ఎలాన్ మస్క్ పక్కా పారిశ్రామికవేత్త. ఆయనకు ప్లాంట్ పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో చూసుకుని ఫైనల్ గా ఖరారు చేసుకుంటారు. ఏపీ ప్రభుత్వం అందులో ఓ ప్రయత్నం చేస్తోంది. ప్లాంట్ పెట్టడానికి తమ ప్రాంతం ఎంత అనుకూలమో చెప్పడమో కాదు.. రాయితీలు ఎలా ఇస్తామో టెస్లాకు సమాచారం ఇస్తోంది. ప్రభుత్వం తన పని తాను చేయగలదు.. వస్తుందా రాదా అన్నది తర్వాత సంగతి కానీ.. కొంత మంది అతి ప్రచారం చేసేస్తున్నారు. వచ్చిందన్నట్లుగా చెబుతున్నారు. చివరికి ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు కూడా అదే ప్రచారం చేస్తున్నారు.
రేపు టెస్లా ప్లాంట్ రాకపోతే.. కూటమి ప్రభుత్వ అసమర్థత అని చెప్పడానికి ఇలాంటి స్కెచ్ వేస్తున్నారో.. గతంలో చేసిన అడ్డగోలు వ్యతిరేక ప్రచారం కారణంగా తమపై పడిన ముద్రను చెరిపేసుకోవాలనుకుంటున్నారో కానీ వారు చేస్తున్న ప్ర చారం మాత్రం అతిగా మారుతోందని టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.