శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పవన్ కల్యాణ్ ను కాకా పట్టేందుకు ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన పవన్ ను పల్లెత్తు మాట అనడం లేదు కదా.. ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలంతా బాయ్ కాట్ చేస్తే.. జగన్ కు కాకపోతే కనీసం పవన్ కు అయినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని బొత్స అంటున్నారు. అసెంబ్లీలో మరో పార్టీ ప్రతిపక్షంగా లేదని అందుకే .. ప్రశ్నించడానికి తమకు హోదా ఇవ్వాలని బొత్స అంటున్నారు.
వైసీపీని ప్రతిపక్షం కాదని ఎవరూ అనడం లేదు. అసెంబ్లీలో విపక్షమే అవుతుంది. అయితే సాంకేతికకంగా ప్రధాన ప్రతిపక్షం అనే గుర్తింపు మాత్రం రాదు అనే చెబుతున్నారు. అసెంబ్లీలో సంఖ్యా బలం ప్రకారం మాట్లాడేందుకు అవకాశం ఉంది. కానీ ప్రతిపక్ష నేత అయితే ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడటానికి చాన్సిస్తారని వారంటున్నారు. వైసీపీ అసెంబ్లీని నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రితో కాదు కదా.. వారి జూనియర్ మంత్రి మాట్లాడినంత సమయం కూడా కేటాయించలేదు.
బొత్సకు ఇవన్నీ తెలుసు కాబట్టే పొడిపొడిగా మాట్లాడుతున్నారు. అయితే ఆయన శాసనమండలిలో కానీ.. మరో చోట కానీ పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం వైసీపీలోనూ చర్చనీయాంశమవుతుంది. జగన్ మోహన్ రెడ్డి ముందుగా పవన్ ను బూతులు తిట్టాలని కోరుకంటారు. కానీ బొత్స మాత్రం మా మంచి పవన్ అనేలా ఉండటంతో ఏదో ఉందన్న భావన పెరుగుతోంది. బొత్స ఢక్కా మొక్కీలు తిన్న రాజకీయ నేత. సరైన సమయంలో సరైన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆయన తీరు ఉంది.