‘హనుమాన్’ తరవాత ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోయింది. బాలీవుడ్ హీరోలు సైతం.. ప్రశాంత్ వర్మతో పని చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా రణ్వీర్ సింగ్ కి ఓ కథ చెప్పాడు. అదే `బ్రహ్మరాక్షస్`. రణ్వీర్ సింగ్ తో ఫోటో షూట్ కూడా చేశారు. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తరవాత మోక్షజ్ఞతో ఓ సినిమా అనుకొన్నారు. కానీ.. అది కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు ‘బ్రహ్మరాక్షస్’ ప్రాజెక్ట్‌ని మళ్లీ పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాడు. ఈసారి ప్రభాస్ ప్రశాంత్ వర్మతో జట్టు కట్టడానికి ముందుకు వచ్చాడు. ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తాడని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే నిజమైంది. బ్రహ్మరాక్షస్ చేయడానికి ప్రభాస్ ఉత్సాహం చూపిస్తున్నాడని, ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ప్రభాస్ పై లుక్ టెస్ట్ కూడా చేయబోతున్నారు. అందుకు ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు ‘ఫౌజీ’తో బిజీగా ఉన్నాడు. `రాజాసాబ్` కూడా పూర్తి చేయాల్సివుంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ కథతో రెడీగా ఉన్నాడు. మరి… వీటి మధ్య ‘బ్రహ్మరాక్షస్’కి ఎప్పుడు క్లాప్ కొడతారో..!