చట్టసభల విషయంలో జగన్ రెడ్డి వైఖరిని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణే ఎక్స్ పోజ్ చేస్తున్నారు. శాసనమండలిలో బొత్స సత్యనారాయణ తనకు సరైన వాగ్దాటి లేనప్పటికీ.. ఇతరులకు అవకాశం ఇవ్వడం ద్వారా .. వారికి నాయకత్వం వహించడం ద్వారా.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవాలో.. అవాస్తవాలో చెప్పి.. టీడీపీ సభ్యులకు సమాధానం చెప్పే పరిస్థితిని తెచ్చి పెడుతున్నారు. దీంతో జగన్ కూడా అసెంబ్లీకి వస్తే అలా ప్రశ్నించేవారు కదా అని అనుకునేవారి సంఖ్య పెరుగుతోంది.
మండలిలో పోరాడుతున్న వైసీపీ
శాసనమండలిలో వైసీపీ పోరాటం .. కూటమిని ఏకపక్షంగా సభ నడుపుకోకుండా చేస్తోంది. చాలా మంది ఎమ్మెల్సీలు నోరు తెరవడంలేదు. వైసీపీ తరపున మెజార్టీ ఉన్నప్పటికీ నలుగురు, ఐదుగురు మాత్రమే మాట్లాడేందుకు సాహసిస్తున్నారు. ఈ క్రమంలో బొత్స సత్యనారయణ ప్రతిపక్ష నేతగా వారిని ముందు పెట్టి పోరాడుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా వ్యవహరించగలుగుతున్నారు. కొన్ని అంశాల్లో ప్రజల్లో అపోహలు రేగేలా చేయగలుగుతున్నారు. టీడీపీ సభ్యులు గట్టిగా సమాధానం ఇస్తున్నారు కానీ.. వైసీపీ ఆ టాపిక్స్ ను చర్చనీయాంశం చేయగలుగుతోంది.. అదే పోరాటం అన్న ప్రశంసలు లభిస్తున్నాయి.
శాసనసభకు జగన్ వెళ్లకపోవడంతో మరింత మైలేజీ
శాసనసభలో ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. జగన్ ప్రశ్నించవచ్చు. అయితే అక్కడ ఆయన తనకు హోదా కావాలని పోవడం లేదు. అసెంబ్లీలో ప్రశ్నించడానికి హోదా అవసరం లేదు. ఆయనే చెప్పుకున్నట్లుగా సభలో తాను ఒక్కడినే ప్రతిపక్షం అని.. అందుకే హోదా ఇవ్వాలని అంటున్నారు. ఆయన ప్రతిపక్ష నేత కాదు అని ఎవరూ చెప్పడం లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడే. అయితే అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమే. ప్రభుత్వ వ్యతిరేక పార్టీ కాబట్టి ప్రతి పక్షమే. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా మాత్రం గుర్తించరు. ఆ గుర్తింపు లేనంత మాత్రాన మాట్లాడే సమయంలో కోత పడదు. మాట్లాడే చాన్స్ ఇస్తారు. అయినా జగన్ వెళ్లడం లేదు.
వైసీపీకి జగనే మైనస్
రాజకీయాలలో వెన్ను చూపడం అనేది పెద్ద మైనస్. అలా చూపిన రాజకీయ నాయకుడు కెరీర్ పొడిగించుకున్న దాఖలాలు లేవు. అసెంబ్లీకి పోనని చెప్పి అనర్హతా వేటు పడుతుందని ఒక రోజు వెళ్లి రావడం.. ఆయన మనస్థత్వానికి అద్దం పడుతోంది. ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు కూడా ఇతనూ లీడరేనా అనుకుంటారు . బొత్స లాంటి వాళ్లను చూసి అయినా జగన్ నేర్చుకోవాల్సిన ఉందన్న అభిప్రాయం రావడానికి కారణం అవుతుంది.