పవన్ కల్యాణ్ విదేశీ పర్యటన గురించి జనసేన నుంచి ఒక అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. యూకే తెలుగు సంఘం వార్షికోత్సవం కార్యక్రమం కోసం పవన్ అక్కడకు వెళుతున్నాడని జనసేన పేర్కొంది. ఈ నెల తొమ్మిది నుంచి పవన్ లండన్ పర్యటన ఉంటుందనేది ఆ ప్రకటన సారాంశం. మరి పవన్ విదేశానికి వెళ్లడం గురించి జనసేన అధికారిక ప్రకటన చేయడం అయితే బాగుంది కానీ.. ఈ పర్యటన గురించి అనేక పుకార్లు, అనుమానాలు గుప్పుమంటున్నాయి.
పవన్ తాజా పర్యటన పట్ల ఆయనపై రొటీన్ వచ్చే విమర్శలు రానే వస్తున్నాయి. గత రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నో పరిణామాలు సంభవించాయి. వాటి పట్ల పవన్ స్పందన అంతంత మాత్రమే! ఎన్నికల సమయంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీల తరపున ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ .. ఆ పార్టీల విషయంలో వస్తున్న విమర్శలు, ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంపై వ్యక్తమవుతున్న నిరసన విషయంలో ఇంత వరకూ స్పందించలేదు. ఆ పార్టీలు ఎన్నికలు హామీలు నిలబెట్టుకోకపోతే తాను ప్రశ్నిస్తా అని పవన్ ప్రకటన చేసి వెళ్లాడు. అయితే కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం లోని బీజేపీ మాట తప్పింది. ఇక తెలుగుదేశం ఆధ్వర్యంలో రుణమాఫీ జరిగింది కూడా అంతంత మాత్రమే!
ఈ వ్యవహారాల్లోనే గాక ఎన్నో హామీల విషయంలో బీజేపీ, తెలుగుదేశంల కూటమి ఇచ్చిన హామీల మేరకు ప్రజలను సంతృప్త పరచలేకపోయింది. ఈ సందర్భాల్లో పవన్ స్పందించింది అంతంత మాత్రమే! అసలు రాజకీయ పార్టీ అధినేతగా పెద్దగా మీడియా ముందకు కూడా రాలేదు ఆయన. మరి ఆ విషయాల్లో స్పందించడానికి వీలు కుదరలేదు కానీ.. ఇప్పుడు విదేశీ పర్యటనకు అయితే వీలు అయ్యిందా? అనేది పవన్ విషయంలో తలెత్తుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న.
ఇదే సమయంలో.. పవన్ విదేశీ పర్యటన పై ఒక పుకారు గట్టిగా షికారు చేస్తోంది. పవన్ జనసేనను బలోపేతం చేయదలిచాడు అని.. దాని కోసం విరాళాల సేకరణకు ఆయన లండన్ పర్యటన పెట్టుకున్నాడనేది మరో అంశం. ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు ఎన్ఆర్ఐలు ఇస్తున్న నిధులతోనే పునాదులు వేసుకున్నాయి. ఇప్పుడు పవన్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడని.. లండన్ లోని తెలుగు వారి నుంచి జనసేన కోసం ఆయన ఈ పర్యటనలో నిధులు సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి నిధుల సేకరణ మొదలయితే.. జనసేన రాజకీయ రంగంలో కూడా యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి.