తెలుగు360 రేటింగ్: 2.5/5
సందీప్‌కిషన్ 30వ సినిమా, ‘ధమాకా’ తర్వాత త్రినాథరావు నక్కిన చేసిన సినిమా, రావు రమేష్ ఒక లీడ్ రోల్ కనిపించిన సినిమా, మన్మధుడు హీరోయిన్ అన్షు రీఎంట్రీ ఇచ్చిన సినిమా.. ఇలాంటి ఆకర్షణలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘మజాకా’. వరుసగా సీరియస్ కథలు చేస్తున్న సందీప్‌కిషన్ ‘మజాకా’ అంటూ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రయత్నించాడు. మరి ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? మజాకా ద్వారా అందించిన వినోదం ఏ స్థాయిలో ప్రేక్షకులని అలరించింది?
వెంకటరమణ (రావు రమేష్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రీ కొడుకులు. కృష్ణ పుట్టినప్పుడే తల్లి చనిపోతుంది. దీంతో ఇంట్లో ఆడదిక్కు కరువౌతుంది. ఇద్దరూ బ్యాచిలర్స్ లానే బతికేస్తుంటారు. ఎప్పటికైనా ఒక ఫ్యామిలీ ఫోటో గోడపై పెట్టుకోవాలనేదే ఈ ఇద్దరి తపన. బీటెక్ పూర్తి చేసిన కృష్ణకు పెళ్లి సంబధాలు చూస్తాడు తండ్రి వెంకటరమణ. అయితే ఆడ దిక్కు లేని ఇంటికి పిల్లని ఇవ్వడానికి ఎవరూ ముందుకురారు. వెంకటరమణ పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలూ తీరుతాయని సలహా ఇస్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఇదే సమయంలో వెంటకరమణకి యశోద (అన్షు) ఎదురుపడుతుంది. ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడిపోతాడు. మరోపక్క కృష్ణ కూడా మీరా (రీతూవర్మ)ని ఇష్టపడతాడు. వీళ్ల ప్రేమకథల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఫ్యామిలీ ఫోటో కోసం తపిస్తున్న వారి ఆశ తీరిందా లేదా? అనేది మిగతా కథ.
సినిమా కథకు ఓ మంచి పాయింట్ తట్టడం చాలా కీలకం. అలాంటి పాయింట్ మజాకా కథలో కుదిరింది. ఓ ఫ్యామిలీ ని సెట్ చేసుకోవాలని తపన పడే తండ్రీ కొడుకులు కథ ఇది. ఎమోషన్, హ్యుమర్ రెండూ వున్న పాయింట్. కాకపోతే ఈ పాయింట్ సంపూర్ణమైన కథగా మార్చడంలో ఇటు రచయిత అటు దర్శకుడు ఇద్దరూ నీళ్ళు నమిలేసి, రీళ్లకు రీళ్లు వేస్ట్ చేశారు.
వెంకటరమణ, కృష్ణ, ఎస్ఐ అజయ్ కి తమ పరిస్థితి వివరించే సన్నివేశంతో నేరుగా కథలోకి వెళ్లారు. తండ్రీ కొడుకుల ప్రేమకథలు తెరపైకి వచ్చాక దర్శకుడు అనుకున్న హ్యుమర్ పండాల్సింది. కానీ చాలా సన్నివేశాలు సాదాసీదా గా సాగిపొతుంటాయి. వెంకటరమణ, కృష్ణ పేజీలకు పేజీలు డైలాగులు చెబుతుంటారు కానీ కావాల్సిన ఫన్ జనరేట్ అవ్వదు. దీనికి కారణం కూడా క్యారెక్టరైజేషన్ లో కొత్తదనం లేకపోవడం, బలమైన సన్నివేశాలు కుదరకపోవడం. తండ్రీ కొడుకుల ప్రేమకథల్ని సమాంతరంగా నడిపిస్తూ ప్రథమార్ధం సాగుతోంది. ప్రేమలేఖల ఎపిసోడ్ హిలేరియస్ గా వచ్చింది. మధ్య మధ్యలో రావు రమేష్ వల్ల కొన్ని నవ్వులు పండాయి. విశ్రాంతికి ముందు వచ్చే ఓ ట్విస్ట్ బావుంది. ఆ సీన్‌ని డిజైన్ చేసిన విధానం కూడా బాగా కుదిరింది.
ఇంటర్వెల్ ట్విస్ట్ కారణంగా తండ్రికొడుకుల కథ కాస్త మేనత్త మేనకోడలు ట్రాక్ గా మారిపోతుంది. అప్పటివరకూ ఓ ఎమోషన్ తో కంటిన్యూ అయిన ప్రేక్షకుడికి సడన్ గా ఈ సీరియల్ ట్రాక్ డైజస్ట్ అవ్వదు. పైగా మేనత్త మేనకోడలు కాన్ ఫ్లిక్ట్ కూడా చాలా అర్టిఫీషియల్ గా వుంటుంది. ఈ రెండు పాత్రలు అంత మొండిగా వుండటానికి గల రీజన్ ని బలంగా చూపించలేదు. ఫస్ట్ హాఫ్ లో ఎంతోకొంత ఫన్ వుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మేనత్త మేనకోడలు ఈ కథని రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్ళిపోయారు. అటు తండ్రికొడుకులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. దీంతో తెరపైకి వచ్చిన సన్నివేశాలు చాలా కృతకంగా తయారైయ్యాయి. ఇక క్లైమాక్స్ లో సినిమా ఎమోషనల్ బాట పడుతుంది. రావు రమేష్, రీతూ వర్మ మధ్య వచ్చే గజ్జెలు శబ్దం సీన్ వర్క్ అవుట్ అయ్యింది. దాన్ని బాగా హ్యాండిల్ చేశారు. అప్పటి వరకూ నవ్వించిన రావు రమేష్, అక్కడికి వచ్చే సరికి ఎమోషన్ పండిస్తాడు. ఆ సీన్ రావు రమేష్ అనుభవాన్ని, ప్రతిభని వెండి తెరకు మరోసారి చాటి చెబుతుంది. కానీ మిగతాదంతా చాలా కన్వీనియంట్ రైటింగ్. ముఖ్యంగా రావు రమేష్, అన్షుల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే.. మరీ తేలిపోతుంది. అనకాపల్లి పెళ్లి ఎపిసోడ్ కేవలం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కాన్సెప్ట్. కథని సాగదీయడం మినహాయిస్తే.. అక్కడ ఫన్ వర్కవుట్ అవ్వలేదు. రావు రమేష్ – అన్షులు లేచిపోయే సీన్ కూడా వర్కవుట్ కాలేదు. ఈ ఎపిసోడ్స్ దగ్గర కాస్త శ్రద్ధ పెడితే.. సెకండాఫ్ కూడా పాస్ అయిపోయేదే.
సందీప్ కిషన్ హుషారుగా కనిపించాడు. కమర్షియల్ సినిమాలకి సరిపడే ఎనర్జీ తనలో వుంది. కృష్ణ పాత్రని ఆశువుగా చేసుకుంటూ వెళ్ళాడు. నిజానికి ఇలాంటి కథ ఒప్పుకున్నందుకు నటుడిగా తనని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇందులో సందీప్ కిషన్ కంటే రావు రమేష్ స్క్రీన్ టైం ఎక్కువ. రావు రమేష్ ది ఇందులో లీడ్ రోల్ అనుకోవచ్చు. నిజానికి ఆయన ఓ సీన్ లో వుంటేనే ఏదోరకంగా అలరించేస్తాడు. కానీ ఇందులో పేజీలకి కొద్ది డైలాగులు, సుదీర్ఘమైన సన్నివేశాల్లో కనిపిస్తున్నప్పటికీ ఆయన మార్క్ తెరపైకి రాదు. బహుశా ఆ యంగ్ లుక్ ని పట్టుకొని ఆ తరహాలో మెప్పించడానికి ఆయన కాస్త ఇబ్బంది పడ్డారేమో అని ఫీలింగ్ కూడా కలిగింది. అయితే పట్టీల సీన్లో మాత్రం ఆయన మెరిశాడు. `ఇలాంటి సన్నివేశాలు కదా, ఈయనకు రాయాల్సింది` అనిపిస్తుంది. రీతూ వర్మ హుందాగా కనిపించింది. అయితే కాలేజ్ ఎపిసోడ్స్ క్లిక్ అవ్వలేదు. అలాగే మేనత్తతో సంఘర్షణ కూడా కుదరలేదు. అన్షు ది చాలా కీలకమైన పాత్ర. అయితే ఆ క్యారెక్టర్ కథలో సహజంగా కూర్చోలేదు. ఆమె ఎంపిక కూడా రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది. భార్గవ్ వర్మ (మురళీశర్మ) క్యారెక్టరైజేషన్ బావుంది. అదొక టైపు సైకో పగ. ఈ పాత్రను ఇంకొంచెం బాగా వాడుకోవాల్సింది.
లియోన్ జేమ్స్ మ్యూజిక్ కి సినిమాకి కలిసిరాలేదు. పాటలు ఆకట్టుకోవు. సొమ్మసిల్లి పాట ప్లేస్ మెంట్ అస్సలు కుదరలేదు. బీజీఎం కూడా సోసో గానే వుంది. డైరెక్టర్ త్రినాధ్ నక్కిన మేకింగ్ ఓ ఎనర్జీ వుంటుంది. అది ఇందులో లోపించింది. రైటర్ ప్రసన్న చాలా సన్నివేశాలు రాజీపడి రాసినట్లుగా వుంటుంది. ముఖ్యంగా రావు రమేష్ అన్షు ట్రాక్ ని కలిపిన విధానం టూ మచ్ సినిమా లిబర్టీ. సందీప్ – రీతూ వర్మ లవ్ స్టోరీని కాస్త కొత్తగా డిజైన్ చేయాల్సింది. ఇంటిల్లిపాది చూసే ఓ సినిమాని చేయాలని తపన పడ్డాడు సందీప్‌కిషన్. నిజానికి ఎలాంటి అసభ్యత లేని సినిమానే ఇది. కాకపొతే టైటిల్ లోని మజా సినిమాలో కొరవడింది. ఫస్టాఫ్ ని ఎంగేజ్ చేసిన దర్శకుడు, ఓ మంచి ఇంట్రవెల్ బ్యాంగ్ వేసి ఉత్సాహం తీసుకొచ్చాడు. దాన్ని సెకండాఫ్‌లోనూ కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది.
తెలుగు360 రేటింగ్: 2.5/5