తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ చిన్న అవకాశం వచ్చినా కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టడానికి, ఆయనపై అనుమానాలు పెంచడానికి ఏ మాత్రం సంశయించడం లేదు. ఢిల్లీలో ప్రధానితో సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా దుబాయ్ లో చనిపోయిన నిర్మాత కేదార్ వ్యవహారంపై కూడా మాట్లాడారు. ఇటీవల తెలంగాణలో మొత్తం మూడు అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయని.. వాటిపై కేటీఆర్ ఎందుకు దర్యాప్తు కోసం డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.
మొదటిది రాజలింగ మూర్తి హత్య కాగా.. రెండో హత్య సంజీవరెడ్డి అనే లాయర్‌ది. మూడో మరణం నిర్మాత కేదార్ ది. దుబాయ్ లో జరిగిన ఈ మరణం సమయంలో ఓ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని ఆయన ఎవరని రేవంత్ ప్రశ్నించారు . అటు రాజలింగమూర్తికి, ఇటు కేదార్ కి కూడా లాయర్ సంజీవ రెడ్డేనని రేవంత్ చెబుతున్నారు. ఆ కేదార్ .. కేటీఆర్ కు వ్యాపారభాగస్వామి అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఎందుకు విచారణకు అడగడం లేదని .. విజ్ఞప్తి చేస్తే తాము విచారణ చేయిస్తామని చెప్పుకొచ్చారు.
రాజలింగమూర్తి హత్య పూర్తిగా భూ వివాదాలతో జరిగిందని పోలీసులు ప్రకటించారు. సంజీవరెడ్డి అనే లాయర్ అనుమానాస్పద మరణం లేదా హత్య గురించి బయటకు రాలేదు. సీఎం రేవంత్ రెడ్డే ఆ విషయం చెబుతున్నారు. నిర్మాత కేదార్ దుబాయ్ లో చనిపోవడం వెనుక ఏం జరిగిందో అక్కడి పోలీసులు చెప్పాల్సి ఉంది. అయితే ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కలిగేలా చిట్ చాట్ లో రేవంత్ వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ వర్గాలంటున్నారు. ఇది పూర్తిగా బురద చల్లే రాజకీయమని అంటున్నాయి.