పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా కొన్ని ప్రయత్నాలు చేశాడు. నటుడిగా మార్కులు తెచ్చుకొన్నాడు కానీ, ఆ సినిమాలు వర్కవుట్ అవ్వలేదు. ప్రేమకథలు చేయాల్సిన సమయంలో, యాక్షన్ స్టోరీల్ని ఎంచుకొని తప్పు చేశాడన్న కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకొని ఓ సినిమా చేస్తున్నాడు. అదే ‘తల్వార్’. కాశీ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈరోజు మహా శివరాత్రి సందర్భంగా ఓ డైలాగ్ టీజర్‌ని విడుదల చేశారు. యుద్ధం – ఆయుధం – న్యాయం – అన్యాయం.. ఇలాంటి బరువైన పదాలు ఈ గ్లింప్స్‌లో వినిపించాయి. డైలాగ్ బాగుంది. పూరి ఆకాష్ చెప్పిన విధానం కూడా బాగుంది. ఆ డైలాగ్ తో కథా నేపథ్యం ఏమిటన్నది అర్థం అవుతోంది. ఇంత వరకూ ఓకే. కానీ… ఆకాష్ మళ్లీ యాక్షన్ బాట పట్టడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వయసులో చక్కగా ఓ లవ్ స్టోరీని చేసుకొంటూ కెరీర్‌ని బిల్డ్ చేసుకోవాలి. హీరోగా ఒకట్రెండు హిట్లు పడితే అప్పుడు యాక్షన్ సినిమాల్ని ట్రై చేయొచ్చు. కానీ తానేమో యాక్షన్ కథల్ని ఎంచుకొంటున్నాడు. పైగా ఇది పాన్ ఇండియా సినిమా ఆయె.
కాకపోతే ‘తల్వార్’ టీమ్ కాస్త గట్టిగానే ఉంది. ప్రకాష్ రాజ్, అనసూయ, అజయ్ ఇలా కాస్టింగ్ బలంగానే కనిపిస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. పూరి ఆకాష్ లుక్ రివీల్ చేయకపోయినా – తన ఆహార్యం మాస్‌కి నచ్చేలా ఉంటుందని అర్థమవుతోంది. ఈ సినిమా కోసం ఆకాష్ చాలా కష్టపడ్డాడని, లుక్ పరంగానూ జాగ్రత్తలు తీసుకొన్నాడని చిత్రబృందం చెబుతోంది. ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుందేమో చూడాలి.