పోసాని కృష్ణమురళిని హఠాత్తుగా అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఇక తాను సన్యాసం తీసుకున్నానని ప్రకటించినట్లుగా పవన్, చంద్రబాబు, లోకేష్‌లపై అడ్డగోలుగా నోరు పారేసుకున్న వ్యక్తి తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానని తీర్థయాత్రలు చేసుకుంటానని ప్రకటించి సైలెంట్ అయ్యారు. ఇక వదిలేస్తారా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అలా వదిలే చాన్స్ ఉండదని పోలీసులు తేల్చారు. సమయం సందర్భం కలసి రావాలి కానీ తప్పు చేసినప్రతి ఒక్కడూ అనుభవించాల్సిందేనని పోసాని ఉదంతం స్పష్టం చేస్తోంది.
వీళ్లను చూసిచూడనట్లుగా వదిలేయలేని రాజకీయం
నిజానికి ఈ నోటి విరేచనాలు చేసుకున్న వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. కానీ వీళ్లు ఏమనుకుంటారంటే.. తమను ఏమీ చేయలేరని.. చేతకాని ప్రభుత్వం అనుకుంటారు. అలాంటి మాటలు పడాలని ఏ ప్రభుత్వమూ అనుకోదు. అందుకే చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. జగన్ మోహన్ రెడ్డి హయాంలో చేసిన రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే.. ఆయన కోసం మాట్లాడిన వారి మాటల్ని చూస్తే ఇప్పటికీ రక్తం మరిగిపోతుంది. ఇలాంటి వాళ్లను ఎందుకు సహించాలన్న ప్రశ్న సామాన్యుల నుంచి వస్తుంది.
అసలు అరెస్టులు ఇంకా ఉన్నాయి !
ప్రస్తుతానికి జగన్ రెడ్డి కోసం ఆవేశపడి.. ఇతరుల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టిన వారి అరెస్టులే జరుగుతున్నాయి. ముందు ముందు వీరి వ్యవహారంతో డొంక కదల్చబోతున్నారని అర్థంచేసుకోవచ్చు. ప్రభుత్వం ఏడాది పూర్తి అయ్యే లోపు చేయాల్సినవన్నీ చేస్తుంది. గత ఎన్నికల్లో దోపిడీలకు పాల్పడిన.. దారి తప్పిన..తగీత దాటిన వారందరికీ చేయాల్సిన సన్మానాలు చేస్తుంది. అందులో చాలా సంచలనాలు ఉండవచ్చు.
అందుకే రేపన్నది లేనట్లుగా రాజకీయాలు చేయకూడదు !
రాజకీయాల్లో రేపు అన్నది లేనట్లుగా రెచ్చిపోతే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వైసీపీ నేతల దుర్భర జీవితాలే సాక్ష్యం. చాలా మంది జైళ్లలో ఉన్నారు. కొంత మంది పరారీలో ఉన్నారు. ఇంకాకొంత మంది బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. తప్పయిపోయిందని క్షమాపణలు చెబుతున్నారు. నాడు అధికారం ఉందని.. ఎవడూఏమీ చేయలేదని వాగడం ఎందుకు.. ఇవాళ ఇన్ని టెన్షన్లు పడటం ఎందుకు?. రాజకీయాల్లో రేపుఅనేది ఉంటుందన్నట్లుగా రాజకీయాలు చేస్తే..కనీసం గౌరవం అయినా దక్కుతుంది.