నేరాలు చేసి కోర్టుల్లో శిక్ష పడిన వారిని శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలన్న డిమాండ్ ను కేంద్రం తోసిపుచ్చింది. ఆరేళ్ల వరకు ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తే చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. రాజకీయ నేతలు ఎవరికైనా శిక్ష పడితేవారిని అసలు ఇక ఎన్నికల వ్యవస్థకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రం అభిప్రాయాన్ని అడిగింది.
ప్రస్తుతం చట్టం ప్రకారం రెండేళ్ల వరకూ శిక్షపడితే తర్వాత ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. తక్షణం అనర్హతా వేటు పడుతుంది. దీన్ని శాశ్వతం చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. కేంద్రం ఈ ప్రతిపాదను వ్యతిరేకించడమే కాకుండా.. అలా చేయాల్సి వస్తే.. ఆ విషయాన్ని పార్లమెంట్ కు వదిలేయాలని కోరింది. పార్లమెంట్ లో చట్టం చేస్తే సమస్య ఉండదని చెబుతోంది.
దేశ రాజకీయవ్యవస్థ ప్రస్తుతం దుర్భరంగా ఉంది. నేరస్తులు మాత్రమే రాజకీయాల్లో నిలబడగలరన్నట్లుగా పరిస్థితి మారింది. రాజకీయాల్లో ఉన్న వారు నేరాలు చేసి..వ్యవస్థల్ని మేనేజ్ చేసి.. తమ కేసులు ముందుకు సాగుకుండా చూసుకుంటున్నారు. అలాంటి వారే రాజకీయ ప్రత్యర్థుల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి.. తామంతా ఒకటే అని నిరూపించాలనుకుంటున్నారు. దీని వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి.