దుబాయ్ లో చనిపోయిన నిర్మాత కేదార్ నాథ్ సెలగంశెట్టి వ్యవహారం రాజకీయాలతో పాటు టాలీవుడ్ లోనూ కలకలం రేపుతోంది. కానీ ఒక్కరు కూడా బయటపడటం లేదు. దుబాయ్ లోనే రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలను కేదార్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆయనతో పాటు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే. అయితే తాను కాదని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓ వీడియో రిలీఫ్ చేశారు.
కేదార్ చనిపోయారన్న సమాచారం వచ్చింది కానీ…అసలేం జరిగిందన్నది మాత్రం బయటకు రానివ్వడం లేదు. కేసుపై క్లారిటీ వస్తేనే దుబాయ్ పోలీసులు క్లియరెన్స్ ఇస్తారు. గుండెపోటుతో చనిపోయారని చెబుతున్నారు కానీ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. కేదార్ చనిపోయింది దుబాయ్ లో కాబట్టి అక్కడి పోలీసులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఎలాంటి కారణాలతో చనిపోయారో బయట పెట్టే అవకాశం ఉంది.
రాజకీయ, సినీ ప్రముఖులకు చెందిన డబ్బును కేదార్ ద్వారా దుబాయ్ లో పెట్టుబడులుగా పెట్టించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేదార్ బినామీగా ఉంటూ అందరి డబ్బులను పెట్టుబడులుగా పెడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆయన హఠాత్తుగా చనిపోవడంతో ఆయన ఎక్కడ పెట్టుబడులు పెట్టారో.. వాటిని ఎలా తమ పేర్ల మీదకు మార్పించుకోవాలో తెలియక కొంత మంది తంటాలు పడుతున్నారని అంటున్నారు. పెద్దగా పేరు లేని నిర్మాత మరణం .. మొత్తం పాలిటిక్స్.. సినీ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే బయటకు మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు.