తొలి ప్రేమతో ఓ ట్రెండ్ సృష్టించిన దర్శకుడు కరుణాకరన్. ఆ తరవాత ప్రభాస్ తో డార్లింగ్ చేశాడు. ఉల్లాసంగా ఉత్సాహంగా, యువకుడు, వాసు లాంటి మంచి సినిమాలు కరుణాకరన్ ఖాతాలో ఉన్నాయి. అయితే కొంతకాలంగా ఆయనకు హిట్ లేదు. చాలా కాలంగా మెగాఫోన్ కూడా పట్టలేదు. ఈతరం కరుణాకరన్ ని మర్చిపోతోంది కూడా. ఈ దశలో మరో ప్రయత్నం చేయబోతున్నాడు ఈ దర్శకుడు. దిల్ రాజు బ్యానర్లో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకొన్నాడు. ఆశీష్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడట కరుణాకరన్. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయి. ఆశీష్ కి కూడా కథ నచ్చింది. దిల్ రాజు విని `ఓకే` అంటే… చాలు. అన్నీ కుదిరితే ఏప్రిల్ నుంచి సినిమా పట్టాలెక్కే ఛాన్స్ వుంది. కరుణాకరన్ లవ్ స్టోరీల్ని బాగా డీల్ చేస్తారు. ఈ సినిమా కూడా ఆ నేపథ్యంలోనే సాగుతుందని సమాచారం అందుతోంది.
ఆశీష్ హీరోగా ‘సెల్ఫీష్’ అనే సినిమా సగం తీసి ఆపేశారు. దానికి మరమత్తులు చేయాల్సిన సమయం వచ్చింది. సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకొంటోంది. ‘పుష్ప 2’ తరవాత సుకుమార్ ఈ స్క్రిప్టుకు రిపేర్లు చేస్తారని, ఆ తరవాతే షూటింగ్ మొదలవుతుందని దిల్ రాజు ఇది వరకే చెప్పారు. ప్రస్తుతం సుకుమార్ కూడా అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది.