సినిమా చూపిస్త మావ, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా… ఇలా వరుస విజయాలతో ఆకట్టుకొన్న దర్శకుడు నక్కిన త్రినాథరావు. ఆయన దర్శకత్వం వహించిన ‘మజాకా’ ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాకు యావరేజ్ మార్కులే పడ్డాయి. బాక్సాఫీసు దగ్గర ఫైనల్ రిజల్ట్ ఏమిటన్నది ఈ వారంలో తేలిపోతుంది. ఈలోగా తన తదుపరి సినిమా పనుల్లో పడిపోయారు నక్కిన త్రినాథరావు. ఆయన దిల్ రాజు బ్యానర్లో, మైత్రీ మూవీస్లో అడ్వాన్సులు తీసుకొన్నారు. ఈ రెండింటిలోనూ సినిమాలు చేయాల్సివుంది. ముందుగా దిల్ రాజు సంస్థలోనే సినిమాని పట్టాలెక్కిస్తారని సమాచారం. అయితే హీరో ఎవరన్నది తేలాల్సివుంది.
ఇటీవల ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ని కలిశారని టాక్. ఆయనకు ఓ కథ చెప్పారని సమాచారం. అన్నీ కుదిరితే బెల్లంకొండతోనే తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ఫుల్ బిజీ. ఆయన చేతిలో 4 సినిమాలున్నాయి. హైందవ, భైరవం టైసన్ నాయుడుతో పాటుగా మరో సినిమా కూడా షూటింగ్ జరుపుకొంటోంది. ‘టైసన్ నాయుడు’, ‘భైరవం’ చిత్రాలు పూర్తయ్యాకే నక్కిన చిత్రాన్ని మొదలుపెట్టే ఛాన్సుంది. భైరవం షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తోంది.