కమర్షియల్ సినిమాకు ఓ కొత్త అర్థం చెప్పిన దర్శకుడు మురుగదాస్. ‘గజిని’ సినిమా ఒక్కటి చాలు. మురుగదాస్ రేంజ్ ఏమిటో చెప్పడానికి. అయితే ఆయన కూడా కొంతకాలంగా ఫామ్ లో లేడు. ఏవో జిమ్మిక్కులు చేస్తున్నాడు కానీ వర్కవుట్ అవ్వడం లేదు. ఆయన ఆశలన్నీ ‘సికిందర్’పైనే. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. రష్మిక హీరోయిన్. కాంబినేషన్ పరంగా క్రేజ్ ఉన్న సినిమా ఇది. ఈ రంజాన్ పండక్కి రాబోతోంది. ఈద్‌కు సల్మాన్ భాయ్ నుంచి సినిమా రావడం రివాజు. అందుకే ఆఘమేఘాల మీద ఈ సినిమా పనుల్ని పూర్తి చేస్తున్నారు. ఈరోజు టీజర్ కూడా విడుదలైంది.
ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని టీజర్ ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయింది. డైలాగ్ – ఫైట్, డైలాగ్ – ఫైట్.. ఈ టీజర్ అంతా ఇలానే సాగింది. ఓ మామూలు కమర్షియల్ సినిమా టీజర్ చూసిన ఫీలింగ్ ఉంది తప్ప, మురుగదాస్ మార్క్ లేదు. మురుగదాస్ టీజర్, ట్రైలర్లో కూడా ఓ కాన్సెప్ట్ ఉంటుంది. అదేం కనిపించలేదు. పైగా సౌత్ ముద్ర ఎక్కువగా ఉంది. బహుశా… ఇటీవల సౌత్ సినిమాల్ని బాలీవుడ్ బాగా ఇష్టపడుతోంది. ఇక్కడి సినిమాలు అక్కడ బాగా ఆడుతున్నాయి. అందుకే… మేకింగ్ లో ఆ తేడా కనిపించిందనుకోవాలి. మురుగదాస్‌కే కాదు, సల్మాన్ ఖాన్‌కీ ఈ విజయం చాలా అవసరం. ఓవైపు షారుఖ్ ఖాన్ వరుసగా హిట్లు కొడుతున్నాడు. తన ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకోవాలంటే వాళ్లకో సాలీడ్ హిట్ ఇవ్వాలి. అందుకే ఈ సినిమా విజయం తనకు చాలా అవసరం. టీజర్ చూసి… భవిష్యత్తు నిర్ణయించేస్తున్నారు ఫ్యాన్స్. సినిమాకు వెళ్లాలా, వద్దా? అనేది నిర్ణయించేవి కూడా టీజర్, ట్రైలర్లే. అలాంటి టీజర్ వీక్ గా ఉంటే ఎలా? కనీసం ట్రైలర్లో అయినా మురుగదాస్ మార్క్ కనిపిస్తుందేమో చూడాలి.