అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వారిని, మహిళల్ని, పిల్లల్ని వదలకుండా రాజకీయం చేసిన వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అయితే ఇంకా పెద్దిరెడ్డి వంటి పెద్దల వద్దకు పోలేదు. అసభ్యంగా మాట్లాడిన వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నారు. దీనికి కూడా ఓ ప్రత్యేకమైన స్కీమ్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అరెస్టుల వల్ల ఒక్కరు కూడా అయ్యో పాపం అనేవారు లేకుండా చేశారు. ఇంత ఆలస్యం అయింది ఎందుకు అని ప్రశ్నించేవారే ఉన్నారు. అదే సమయంలో ఇలాంటి వారికి వైసీపీ మద్దతు తప్పక ప్రకటించారు. దాని వల్ల ఆ పార్టీ ప్రజల్లో మరింత చులకన అవుతోంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
వంశీ, పోసానిలను సమర్థిస్తే ఎవరికి నష్టం ?
వల్లభనేని వంశీ మోహన్ పై..వైసీపీ క్యాడర్ లోనే సానుభూతి లేదు. ఆయనకు బాగా జరిగిందని తమ పార్టీ ఓడిపోవడానికి ఆయన కూడా ఓ కారణం అని అనుకుంటూ ఉంటారు. పోసాని కృష్ణమురళి తిట్టినట్లుగా ఎవరైనా జగన్ ఫ్యామిలీని తిడితే ఎలా ఉంటుందో ఊహించుకుంటే.. ఆయనను కూడా ఎవరూ సమర్థించరు. అరెస్టులు కూడా తప్పని ఎవరూ చెప్పరు. వారికి అలాంటి శిక్ష పడాల్సిందేనని ఎక్కువ మంది భావిస్తున్నారు. కానీ వీరిని వైసీపీ అధ్యక్షుడు జగన్ తప్పక సమర్థించాల్సి వస్తోంది.
వాడుకుని వదిలేశారన్న పేరు రాకుండా సమర్థించాల్సిన పరిస్థితి
అరెస్టు అవుతున్న వారికి ప్రజల్లో ఉన్న ఇమేజ్.. వారికి సపోర్టు చేస్తే వచ్చే సైడ్ ఎఫెక్టుల గురించి జగన్ కు తెలియవా..అంటే తెలుసు. కానీ వారికి మద్దతివ్వక తప్పని పరిస్థితి. లేకపోతే తన మానసిక ఆనందం కోసం వారితో బూతులు తిట్టించి ఇప్పుడు సైలెంట్ అయిపోతారా అనే ప్రశ్నలు వస్తాయి. వంశీని అరెస్టు చేసినప్పుడు 36 గంటల పాటు జగన్ స్పందించలేదు. దీంతో ఇదీ ఆయన తత్వం అని అంటున్నారని స్పందించారు. ఇప్పుడు పోసానికీ తప్పదు.
వైసీపీ మారదని ప్రజలకు చెప్పేలా అరెస్టులు
వైసీపీని ఇరికించేసి.. అరెస్టులపై సానుభూతిరాకుండా.. వారికి తప్పనిసరిగా వైసీపీ మద్దతిచ్చేలా చేసి ప్రజల్లో ఇక వైసీపీ మారదన్న అభిప్రాయం కలిగేలా చేయడానికి వ్యూహాత్మకంగానే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రాప్ నుంచి వైసీపీ తప్పించుకోవడం అంత తేలిక కాదు.