వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. వైఎస్ జగన్, భారతిలకు సరస్వతి పవర్ విషయంలో ఎలాంటి అధికారం లేదని అసలు వారికి అందులో వాటాలు లేవని అన్నీ తన పేరిట బదిలీ అయ్యాయని.. వారికి పిటిషన్ వేసే అర్హత లేదని విజయలక్ష్మి ఎన్సీఎల్టీలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని.. జగన్, భారతిలపై ఆరోపణలు చేశారు. అంతే కాదు వీరిద్దరూ కలిసి ఎన్సీఎల్టీని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. జగన్, షర్మిల మధ్య ఉన్న ఆస్తి తగాదాలతో తనను కోర్టు ముందు నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ తల్లీకి కూడా ఇంత నిస్సహాయస్థితి రాకూడదని.. ఇలాంటి పరిస్థితి తీసుకు వచ్చి ఆవేదనకు గురి చేయడం జగన్, భారతిలకు సరి కాదని విజయమ్మ తన అఫిడవిట్ లో చెప్పుకొచ్చారు. గిఫ్ట్ డీడ్ ప్రకారం తనకు వచ్చిన వాటాలన్నీ చట్ట ప్రకారమే ఇచ్చారని.. షర్మిల భవిష్యత్ ప్రయోజనాల కోసం ఇచ్చారని అనడం అబద్దమని స్స్పష్టం చేశారు. జగన్, భారతి అబద్దాలు చెబుతున్నారన్నారు. ప్రస్తుతం జగన్, భారతిలకు వాటాలేమీ లేవని..మొత్తం 99.75 శాతం వాటాలు తనవేనని విజయమ్మ తెలిపారు.
తాను షర్మిలకు ప్రేమతో సరస్వతి పవర్ రాసిచ్చానని ఇప్పుడు తనకు ఎలాంటి ప్రేమ లేదని అందుకే తన కంపెనీతనకు ఇప్పించాలని జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. కుటుంబంలోజరిగిన ఓ ఎంవోయూ ఆధారంగానే తన తల్లి పేరుతో వాటాలను బదిలీ చే్శామన్నారు. అయితే అనధికారికంగా తన తల్లి వాటాలను బదిలీ చేశారని జగన్ ఆరోపించారు. కానీ జగన్, భారతి అన్నీ అబద్దాలే చెబుతున్నారని .. సంబంధం లేని ఎంవోయూను తెరపైకి తెస్తున్నారని విజయమ్మ అంటున్నారు.
ఈ కేసు వ్యవహారంలో తల్లి, చెల్లితో కూడా జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.