తుని విద్వంసం కేసులో అరెస్ట్ అయిన 13మందిని విడుదల చేయాలంటూ ఏకధాటిగా 12 రోజులు నిరాహార దీక్ష చేసి, రాష్ట్ర రాజకీయాలని వేడెక్కించి, ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించిన ముద్రగడ పద్మనాభం, తన పంతం నెరవేర్చుకొని దీక్ష విరమించిన తరువాత ఒక్కసారే మీడియాతో మాట్లాడారు. మళ్ళీ ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. ఆయన దీక్ష విరమించిన తరువాత మాజీ కాంగ్రెస్ ఎంపిలు హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ తదితరులు ఆయన నివాసానికి వెళ్లి కలిసారు. కాపులు, దళితులు చేతులు కలిపి పోరాడితే రాజకీయాధికారం సాధించుకోవచ్చు. అందుకు ముద్రగడ సిద్దపడితే తామంతా ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని హర్ష కుమార్ చెప్పారు. అంటే ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోందనే సంకేతాలు ఇచ్చినట్లయింది. కానీ ఆ తరువాత మళ్ళీ ముద్రగడ అటువంటి ప్రయత్నాలు ఏవీ చేస్తునట్లు వార్తలు రాలేదు. కనుక ప్రస్తుతానికి ఆ ఆలోచన పక్కనబెట్టి కాపులకి రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. దానికి ఆగస్ట్ నెలాఖరు వరకు గడువు ఇస్తున్నట్లు ఇదివరకే ముద్రగడ పద్మనాభం ప్రకటించారు కనుక అంత వరకు వేచి చూస్తూ సైలెంట్ మోడ్ లో ఉండాలని భావిస్తున్నారేమో. అయితే మంజునాథ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు అది పని మొదలుపెట్టిన దాఖలాలు లేవు. ఇంతవరకు ప్రభుత్వం దాని విధివిధానాలే ఖరారు చేయలేదని తెలుస్తోంది. ఆ లెక్కన అది ఆగస్ట్ నెలాఖరికి నివేదికని సమర్పించడం కూడా అసంభవమే. అప్పుడు ప్రభుత్వం మళ్ళీ దాని గడువు పొడిగించే ప్రయత్నం చేస్తే ముద్రగడ పద్మనాభం మళ్ళీ ఉద్యమానికి సిద్దం కావచ్చు. ముద్రగడ సైలెంట్ మోడ్ లో ఉండిపోయారు కనుక ఇంక ఆయన ఉద్యమించరని భావిస్తూ ప్రభుత్వం కాపుల రిజర్వేషన్ల హామీని అటకెక్కించేయకుండా, మళ్ళీ ముద్రగడ పద్మనాభం యాక్టివ్ అయ్యేలోగానే ఆ హామీ అమలుకోసం చర్యలు చేపట్టడం అందరికీ మంచిది. లేకుంటే పరిస్థితులు పునరావృతం అవుతాయి. ఈసారి కాపు నేతలతో కలిసి (పార్టీలకి అతీతంగా) ఉద్యమిస్తానని ముద్రగడ పద్మనాభం చెప్పారు. వైకాపాతో సాన్నిహిత్యం లేదా దాని మద్దతుని అంగీకరించడం వలన మేలు కంటే కీడే ఎక్కువ జరిగిందనే ఉద్దేశ్యంతోనే ఆవిధంగా చెప్పి ఉండవచ్చు. కనుక మళ్ళీ ఈసారి అయన ఉద్యమం మొదలుపెడితే అది ఇంతకు ముందు జరిపిన వాటికి పూర్తి భిన్నంగా, చాలా ఉదృతంగా సాగే అవకాశం ఉంది. కనుక అటువంటి పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనడం మంచిది.