ఈరోజు ‘మాడ్ 2’కి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. ఈ చిత్రానికి నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మీడియాతో మాట్లాడిన నాగవంశీ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చారు.
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా మొదలుకావాల్సివుంది. దీనికి నాగవంశీనే నిర్మాత. ఏప్రిల్, మేలలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని అనుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుంది. ఈ యేడాది ద్వితీయార్థం లోనే ఈ చిత్రాన్ని మొదలెడతామని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అంటే జూన్ తరవాతే సినిమా ఉంటుంది. తరవాత అంటే… అది డిసెంబరులోగా ఎప్పుడైనా కావొచ్చు. త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్టు విషయంలో చాలా కేర్ తీసుకొంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇంత ఆలస్యం అవుతోంది.
పవన్ కల్యాణ్ నటించిన ‘వీరమల్లు’ మార్చి 28న వస్తుందని అంతా అనుకొంటున్నారు. చిత్రబృందం కూడా ఇదే విషయం చెబుతోంది. అయితే… ‘మ్యాడ్ 2’ని మార్చి 29న విడుదల చేస్తున్నారు నాగవంశీ. `వీరమల్లు` సినిమా రావడం లేదన్న ఉద్దేశంలోనే నాగవంశీ తన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కల్యాణ్‌కు ఆయన చాలా సన్నిహితుడు. పవన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోందన్న విషయంలో నాగవంశీకి స్పష్టత ఉంటుంది. ఆ ముందస్తు సమాచారంతోనే `మ్యాడ్` రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొన్నారు. కానీ నాగవంశీ మాత్రం ‘పవన్ సినిమా విడుదల అయితే మా సినిమాని వాయిదా వేస్తాం’ అంటున్నారు. కానీ… అలా జరిగే అవకాశం లేదు. ‘వీరమల్లు’ చిత్రానికి సంబంధించి మరి కొంత షూటింగ్ బ్యాలెన్స్వుంది. ప్రమోషన్లు కూడా మొదలెట్టలేదు. అందుకే వీరమల్లు రాకపోవొచ్చు.