‘హను మాన్’ తరవాత ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోయింది. తన విజన్, మార్కెటింగ్ స్కిల్స్‌కి పూర్తి మార్కులు పడ్డాయి. ఆటోమెటిగ్గా `జై హనుమాన్`పై ఫోకస్ పడింది. అయితే.. ఇప్పటి వరకూ తదుపరి సినిమా మొదలు కాలేదు. మధ్యలో ఓ యేడాది కాలయాపన జరిగిపోయింది. ‘జై హనుమాన్’ పెద్ద స్క్రిప్టే. ఆ సినిమా కోసం రిషబ్ శెట్టిని ఎంచుకొన్నాడు. ‘కాంతారా 2’ అయ్యాక గానీ ఆయన బయటకు రాడు. ఈలోగా మరో సినిమా చేయాలన్న ఆశ, ఆకాంక్ష ప్రశాంత్ లో ఉన్నాయి. అయితే ఈ విషయంలోనే తాను కన్ఫ్యూజ్ అవుతున్నాడు, సినిమా అభిమానుల్ని కన్ఫ్యూజ్లో పడేస్తున్నాడు.
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ఛాన్స్ ప్రశాంత్ వర్మకే వచ్చింది. ఈ సినిమా ఉంటుంది, ఉండదు, ఆగింది, మళ్లీ మొదలైంది.. అనే గాసిప్పుల మధ్య ఊగిసలాడింది. ఇప్పటికీ ఈ సినిమాపై ఓ స్పష్టత లేదు. ఈలోగా ప్రభాస్ తో ఓ ఫొటో షూట్ పూర్తి చేశాడు. ‘బ్రహ్మరాక్షస్’ సినిమాని ప్రభాస్ తో రూపొందించే పనిలో పడ్డాడు. అయితే ప్రభాస్ ఇప్పుడు ఖాళీగా లేడు. ఫొటో షూట్ అయ్యింది అంతే తప్ప… ప్రశాంత్ వర్మకి డేట్లు ఇవ్వలేదు ప్రభాస్. ఎప్పటి నుంచి ఇవ్వగలడో కూడా క్లారిటీ లేదు. ‘జాంబీరెడ్డి 2’కు సంబంధించిన ఓ కథని తన టీమ్ తో అర్జెంటుగా రెడీ చేసే పనుల్లో ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా అయితే ఆరు నెలల్లో పూర్తి చేసి విడుదల చేయొచ్చు. అయితే తేజా సజ్జా ‘మిరాయ్’ పనుల్లో బిజీగా ఉన్నాడు. తను ఫ్రీ అవ్వాలన్నా మరో రెండు నెలలైనా ఆగాలి. ఇవి కాకుండా ఎప్పుడో మొదలుపెట్టిన ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని ప్రశాంత్ వర్మ పూర్తి చేయాల్సివుంది.
ఒకేసారి ఇన్ని ప్రాజెక్టుల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. పైగా ‘హనుమాన్ 2’, ‘బ్రహ్మరాక్షస్’ భారీ సినిమాలు. ఒకేసారి ఒకే సినిమాపై దృష్టి పెట్టి దానిపైనే ఫోకస్ పెడితే ఫలితాలు బాగుండేవి. కానీ.. ప్రశాంత్ వర్మ అలా చేయడం లేదు. మోక్షు సినిమా ఆగిపోయింది. రణవీర్ సింగ్ తో చేయాల్సిన ‘బ్రహ్మరాక్షస్’ ఆగిపోయింది. అలాంటప్పుడు ప్రాజెక్టుల విషయంలో హడావుడి పడకుండా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. కానీ.. త్వరత్వరగా సినిమా చేసేయాలన్న ఉద్దేశంతో తప్పటడుగులు వేస్తున్నాడు. ఈసారైనా ప్రశాంత్ వర్మ కాస్త ఆచి తూచి అడుగు వేయడం మంచిదేమో?!