తెలంగాణలో బలాన్ని పెంచుకోవాలి. వీలైతే 2019లో అధికారంలోకి రావడానికి చావో రేవో అనే స్థాయిలో పోరాడాలి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లక్ష్యమిది. రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు ఆయన స్థయిర్యం నూరిపోస్తున్నారు. దిశానిర్దేశం చేస్తున్నారు. బూత్ స్థాయి నుంచి బలోపేతానికి చిట్కాలు చెప్తున్నారు. అయినా, ఆశించిన జోష్ కనిపించడం లేదు. అందుకే, మరోసారి తెలంగాణ నేతలకు బ్రెయిన్ వాష్ చేయనున్నారు.
హైదరాబాద్ కు వచ్చిన ప్రతిసారీ తెలంగాణలో ఒకప్పుడు పార్టీలో కనిపించిన జోష్, ఇప్పుడు కనిపిస్తున్న నిరుత్సాహం గురించే అమిత్ షా ప్రస్తావిస్తున్నారు. పార్టీని విజయం దిశగా బలోపేతం చేయడానికి ఎలాంటి కృషి జరగాలో పక్కా రోడ్ మ్యాప్ తరహాలో ఇదివరకే వివరించారని సమాచారం. శుక్రవారం ఢిల్లీలో ప్రత్యేకంగా తెలంగాణ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని అంశాలనూ క్షుణ్ణంగా చర్చించే అవకాశం ఉంది. పార్టీ నేతలు ఎవరేం చేస్తున్నారు, ఎవరు నిర్లక్ష్యంగా వహిస్తున్నారో సమీక్షించే అవకాశం ఉంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సహా సీనియర్ నేతలు ఈ భేటీకి హాజరవుతారు.
బీజేపీకి అధికారం అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే నాయకులు, కార్యకర్తలు తెగువగా పనిచేసే వారు. ఎప్పటికీ అధికారంలోకి రాని పార్టీ అని ప్రత్యర్థి పార్టీల వారు ఎగతాళి చేసినా పట్టించుకునే వారు కాదు. 1984లో ఇందిరా గాంధీ హత్యానంతర సానుభూతి పవనాలు వీచిన సమయంలోనే, హన్మకొండలో పీవీ నరసింహా రావును ఓడించిన పార్టీ బీజేపీ. సికింద్రాబాద్ తో పాటు కరీంనగర్, హన్మకొండ, మహబూబ్ నగర్ లోక్ సభ సీట్లను గెల్చుకున్న చరిత్ర ఉంది. ఏకంగా ఒకే ఎన్నికల్లో 12 అసెంబ్లీ సీట్లను గెల్చుకుని సత్తా చాటిన సందర్భం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ రాజకీయాల్లో బీజేపీని విస్మరించే పరిస్థితి ఉండేది కాదు.
నరేంద్ర మోడీ నాయకత్వంలో పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అనేక రాష్ట్రాల్లోని బీజేపీ కేడర్ కు కొత్త ఉత్తేజం వచ్చింది. ఉత్సాహం పరవళ్లు తొక్కింది. అస్సాంలో కమలనాథులు ఏకంగా పార్టీని అధికారంలోకి తెచ్చారు. కానీ తెలంగాణలో అలాంటి ఉత్సాహం, ఉత్తేజం పెద్దగా కనిపించడం లేదు. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పార్టీ బలపడలేదని అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టింది ఇటీవలే కాబట్టి, ఆయన పనితీరును అంచనా వేయడానికి మరి కొంత సమయం అవసరమని పార్టీ భావిస్తోంది. మొత్తానికి ఈనెల 8న ఢిల్లీలో అమిత్ షా తో జరిగే భేటీ తర్వాత తెలంగాణలో బిజేపీ నేతలకు, కేడర్ కు నయా జోష్ వస్తుందేమో చూడాలి.