వరంగల్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ మేరకు ఆదేశాలపై సంతకాలు చేశారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి చాలా వరకూ కసరత్తు పూర్తి అయింది. మామునూరులో రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే ఎయిర్ స్ట్రిప్ నిర్మించారు. అయితే అది పాడుబడిపోయింది. ఇప్పుడు కొత్తగా అవసరాలకు తగ్గట్లుగా పునర్ నిర్మించాలి. అందు కోసం మరో 253 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు. రేవంత్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భూసేకరణ చివరి దశకు చేరింది.
ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయితే వరంగల్, హైదరాబాద్ కలసిపోయే అవకాశాలు మెరుగుపడతాయి. తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్న వరంగల్ ఇప్పుడిప్పుడే పరుగు అందుకుంటోంది. ఇలాంటి సమయంలో ఎయిర్ పోర్టు లాంటి ఇన్ ఫ్రా పెరిగితే పట్టపగ్గాలుండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రణాళికాబద్దంగా స్థానిక సంస్థలు, ప్రభుత్వం కలిసి చర్యలు తీసుకుంటే.. మెట్రో సిటీగా వరంగల్ మారే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ తర్వాత తెలంగాణలో వరంగల్ కే ఆ స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. భారీ ప్రాజెక్టులు, పరిశ్రమలు హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగిపోయాయి. వాటిని చుట్టుపక్కల ప్రాంతాలకు మళ్లిస్తే.. వరంగల్ కే ఎక్కువ వస్తాయి. ఎయిర్ పోర్టు నిర్మాణంతో మరింతగా అలాంటి అవకాశాలు పెరుగుతాయి.