మార్చి పరీక్షల నెల. వేసవి వినోదాలు మొదలయ్యేది కూడా మార్చిలోనే. ఈ నెలలో కొత్త సినిమాలు బాక్సాఫీసు ముందుకి క్యూ కడుతున్నాయి. ఓ భారీ సినిమాతో పాటు మీడియం, చిన్న సినిమాలూ సందడి చేయబోతున్నాయి.
మార్చి మొదటి వారం నారీ, జిగేల్ అనే ఓ రెండు సినిమాలు వస్తున్నాయి. నారిలో ఆమని లీడ్ రోల్. జిగేల్ సినిమా అంతా కొత్తవాళ్ళు కలిసి చేసింది. ఈ రెండు సినిమాలపై కూడా పెద్ద బజ్ లేదు.
మార్చి7న డబింగ్ సినిమాల హావా కనిపిస్తోంది. బాలీవుడ్ హిట్ సినిమా ‘ఛావా’ డబ్బింగ్ రూపంలో తెలుగులోకి వస్తుంది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తోంది. శంభాజీ జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ఆకట్టుకుంది. తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వుంటుందో చూడాలి. అదే డేట్ కి మలయాళం హిట్ సినిమా ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులు ముందుకు తెస్తోంది. జీవి ప్రకాష్ కింగ్ స్టన్ సినిమా కూడా ఇదే డేట్ కి తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తోంది.
మార్చి 14న రెండు ప్రామెసింగ్ సినిమాలు వున్నాయి. కిరణ్ అబ్బవరం దిల్ రుబాతో వస్తున్నాడు. క విజయం తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా ఇది. అదే రోజు నాని నిర్మించిన కోర్ట్ ప్రేక్షకులు ముందుకు వస్తోంది. యదార్ధ సంఘటనలు ఆధారంగా తీసిన సినిమా ఇది. నాని నిర్మించడం, ప్రియదర్శి లాంటి నటుడు కనిపించడంతో సినిమాపై ఆసక్తి ఏర్పడింది.
మార్చి 27న విక్రమ్ వీరధీర 2, లూసిఫర్ 2 డబ్బింగ్ సినిమాలుగా వస్తున్నాయి. ఈ రెండు కూడా స్టార్ ఎట్రాక్షన్ వున్న సినిమాలే. పైగా లూసిఫర్ కథ గాడ్ ఫాదర్ గా అందరికీ పరిచయం. తొలిభాగం చూసిన ఆడియన్స్ తప్పకుండా రెండో భాగంపై ఆసక్తి చూపించే ఛాన్స్ వుంది.
మార్చి 28 ఓ పెద్ద సినిమా వుంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఈ డేట్ కి వస్తుందని నిర్మాతలు ప్రకటించారు. అయితే ప్రకటన వరకే గానీ సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువని ఇన్ సైడ్ టాక్. పవన్ కళ్యాణ్ వీర అభిమాని నితిన్ రాబిన్ హుడ్ రిలీజ్ కూడా అదే డేట్. అలాగే త్రివిక్రమ్ సొంత ప్రొడక్షన్ హౌస్ గా భావించే సితార తీసిన మ్యాడ్ 2 మార్చి 29 డేట్ ఇచ్చారు. ఈ రెండు సినిమాల కదలికలు చూస్తుంటే వీరమల్లు వాయిదా తప్పదు అనిపిస్తుంది. ఒకవేళ వీరమల్లు వస్తే మాత్రం ఈ రెండు సినిమాలు వెనక్కి వెళ్లిపోయే ఛాన్స్ వుంది. మొత్తానికి ఈ మార్చి వేసవి వినోదాలు అందించడానికి సిద్ధమైయింది. మరి ఇందులో బాక్సాఫీసు పరీక్షని నెగ్గే సినిమాలేవో చూడాలి.