కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఇవ్వాళ్ళ విశాఖపట్నంలో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోంది. కాపుల ఉద్యమాన్ని అణచివేసింది. గుళ్ళు గోపురాలని కూల్చివేస్తోంది. రాజధాని కోసం రైతుల భూముల బలవంతంగా గుంజుకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని గాలికి వదిలేసింది. అన్ని విధాల ప్రజలని మోసం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్న నిలబడి ప్రభుత్వంతో పోరాడుతుంది,” అని చెప్పారు.
ఆ తరువాత పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెదేపా అధికారంలోకి రావడం కోసం చేసిన హామీలని నెరవేర్చలేదు. విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలని కేంద్రప్రభుత్వం చేత అమలుచేయించలేదు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ సాధించేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. మా పార్టీ గ్రేటర్ విశాఖ ఎన్నికలకి సిద్ధంగా ఉంది. కానీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది,” అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజాభిప్రాయానికి పూచిక పుల్లెత్తు విలువనీయకుండా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొన్న దిగ్విజయ్ సింగ్, ఇప్పుడు మొదలి కన్నీళ్లు కార్చుతున్నారు. హామీల అమలు గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నారు. వాటి కోసం ప్రజల తరపున నిలబడి పోరాడుతామని హామీ ఇస్తున్నారు. అయితే ఆ పోరాటం ప్రజల కోసం కాదని అధికారం కోసమేనని వారి మాటలే చెపుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా సజీవంగా ఉందంటే దానికి రెండే కారణాలు కనిపిస్తున్నాయి. 1. కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఏర్పాటు వంటి హామీలపై మాట తప్పడం. 2. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని హామీలపై మాట తప్పడం. అవి ఆ హామీలని నిలేబెట్టుకొని ఉండి ఉంటే నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించడానికి చాలా కష్టమయ్యేది. అవి తమ హామీలని అమలుచేయ(లే)వు కనుక కాంగ్రెస్ పార్టీ కూడా వాటి సహాయంతో మిగిలిన మూడేళ్ళు గడిపేయవచ్చు. కానీ ఎన్నికలలో గెలవగలదా? దాని కోసం అది ఏమి చేస్తుంది? అనే ప్రశ్నలకి ఇప్పుడే సమాధానాలు దొరకవు.