ఏపీ రాజకీయాల్లో బూతుల సంస్కృతికి ప్రత్యక్ష కారకులుగా ఎదుటుగా కనిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇలా కేసులు నమోదవుతాయన్న భయం ఏర్పడగానే .. ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి, టీడీపీ ఆఫీసుపై దాడి వంటివన్నీ సజ్జల కనుసన్నల్లో జరిగాయన్నది ఆ పార్టీలో బహిరంగ రహస్యం. ఇక ఆ పార్టీ నేతలు మాట్లాడే ప్రతి బూతు మాటకు స్క్రిప్ట్ సజ్జల ఆఫీసు నుంచి వస్తుందన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి కూడా అదే పోలీసులకు చెప్పాడు.
ఇలా పోలీసులకు చెప్పగానే అలా తండ్రీ కొడుకులు ఇద్దరికీ అరెస్టు భయం మొదలైపోయింది. ఎక్కడ కేసులు పెట్టి రాత్రికి రాత్రి అరెస్టు చేయడానికి వస్తారో అని ముందుగానే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు చేస్తారని భయం ఉందని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. తమ పాత్ర లేదని.. పోసానికి నోటి దూల కాబట్టి ఆయన అలా మాట్లాడేశారని కోర్టులో వాదిస్తారు. అందులో సందేహం లేదు. కానీ ఇలా వాదించడానికి పెట్టుకునే లాయర్ ఎవరన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అందరికీ పంపినట్లే తమ ఏస్ లాయర్ పొన్నవోలుతో వాదించుకోవాలన్న డిమాండ్లు వైసీపీలో వినిపిస్తున్నాయి.
వైసీపీలో తప్పుడు పనులు చేసి అరెస్టవుతున్న వారి కోసం మంచి లాయర్లను పంపకుండా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపుతున్నారు. ఆయనో పెద్ద సూపర్ స్టార్ లాయర్ అన్నట్లుగా పంపుతున్నారు. కానీ ఆయన టాలెంట్ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనపై అంత నమ్మకం ఉంటే.. సజ్జల కూడా ఆయననే లాయర్ గా పెట్టుకోవాలని నిరంజన్ రెడ్డిని కాదని అంటున్నారు. మరి అందరిలాగానే పొన్నవోలును.. సజ్జల తండ్రి, కుమారులు లాయర్ గా పెట్టుకుని ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారా ?