వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆరు నెలల్లో తేల్చేలా ఆదేశాలివ్వాలని వైఎస్ సునీతా రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలయింది. న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ఈ పిటిషన్ ను.. ప్రజాప్రతినిధుల కేసుల అంశంపై విచారిస్తున్న ధర్మాసనం ముందుకు పిటిషన్ ను పంపాలని సూచించారు. సీబీఐ కోర్టులో ఇప్పటికీ విచారణ చాలా స్లోగా జరుగుతోంది. లక్షల ఫైల్స్ ఉంటే.. కొన్ని వేల ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేశారు. వాటిని ఓపెన్ చేయడానికే ఏళ్లు గడిచిపోతుంది. ఇలాంటి సమస్యలను అధిగమించి ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసేలా ఆదేశించాలని సునీత కోరుతున్నారు.
న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ అండ్ కో పెద్ద ఎత్తున పిటిషన్లు వేసి తమ పై కేసులు అసలు ట్రయల్ వరకూ రాకుండా చేసుకోవడంలో విజయం సాధిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో చార్జిషీట్లు దాఖలు చేసి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకూ ట్రయల్ ప్రారంభం కాలేదు. ఇంకా చెప్పాలంటే ఇంత వరకూ వారు వేసిన డిశ్చార్జ్ పిటిషన్ల ను కూడా క్లియర్ చేయలేదు. ప్రతీ సారి చివరి దశకు వచ్చిన తర్వాత న్యాయమూర్తి బదిలీ అవుతూండటంతో మళ్లీ మొదటకు వస్తోంది.
ఇలాంటి సమస్యలు సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. అందుకే ఇతర ప్రజాప్రతినిధుల విచారణ విషయంలో ఇచ్చిన తీర్పే ఇక్కడా వర్తిస్తుందని ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంది. ఈ కేసులతో పాటు వివేకా కేసును కూడా వేగంగా పూర్తి చేయాలని సునీత కోరుతున్నారు. న్యాయం చేయడమే కాదు.. సరైన సమయంలో చేయడం కూడా ముఖ్యమని చెబుతూంటారు. అతి సింపుల్ గా ఒక్క రోజులో చేధించగలిగే కేసు వివేకా కేసు. ఏళ్ల తరబడి సాగడం బాధితులకు అన్యాయం చేయడమే అవుతుంది.