ఒకప్పుడు రాజకీయ పార్టీలు తమ కార్యకర్తల అందదండలతో, నేతల శక్తి సామర్ధ్యలతో ప్రజాభిమానం పొంది అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించేవి. కానీ ఇప్పుడు ఏ పార్టీకి అంత ఓపికలేక పోవడంతో ప్రత్యర్ధ రాజకీయ పార్టీల నేతలని, ప్రజా ప్రతినిధులని, కార్యకర్తలని ఫిరాయింపులకి ప్రోత్సహిస్తూ, పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణాలో తెరాస, ఏపిలో తెదేపాలు ప్రతిపక్ష పార్టీల నుంచి నేతలని దిగుమతి చేసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. తెదేపా దెబ్బకి బలహీనపడిన వైకాపా కూడా దాని బాటలోనే నడవాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ముందుగా తెదేపాలో అసంతృప్తిగా ఉన్నవారిని, ఆ తరువాత భాజపా, కాంగ్రెస్ పార్టీలలో తమ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్న వారిపై దృష్టి సారించి వైకాపాలోకి రప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ వంటి కొందరు సీనియర్ నేతలు వైకాపాలో చేరారు కనుక వారిద్వారా కాంగ్రెస్ పార్టీలోని నేతలని వైకాపాలోకి రప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాపులకి రిజర్వేషన్లు కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభానికి మద్దతు ఇవ్వడం ద్వారా కాపు సామాజిక వర్గ నేతలని, ప్రజలని కూడా పార్టీవైపు ఆకర్షించే ప్రయత్నం చేసింది.
కాంగ్రెస్ పార్టీ వైకాపాతో స్నేహం కోసం పరితపిస్తుంటే, ఆ పార్టీ నుంచే నేతలని వైకాపాలోకి రప్పించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం చాలా విచిత్రంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి దిగ్విజయ్ సింగ్ ఒకపక్క ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలని వైకాపాలోకి ఫిరాయింపజేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం కూడా విచిత్రంగానే ఉంది. ఒకవేళ వైకాపా ప్రయత్నాలు ఫలించి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీలో చేరేందుకు సిద్దపడితే బహుశః అప్పుడు తెదేపా నేతలు విమర్శలు గుప్పిస్తారేమో?