జేడీ చక్రవర్తి క్యారెక్టరే డిఫరెంట్. ఎవర్నయినా అమితంగా ప్రేమిస్తాడు. తేడా వచ్చినా అదే స్థాయిలో ఇచ్చి పడేస్తాడు. ఎవర్నయినా డోంట్ కేర్ అనుకొనే రకం. ఆర్జీవీ శిష్యుడు కదా, ఆ లక్షణాలు ఎక్కడికిపోతాయ్? ప్రేమయినా, కోపం అయినా.. వెంటనే వ్యక్తపరచాల్సిందే. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. రాఘవేంద్రరావుతో జేడీకి మంచి అనుబంధం ఉంది. రాఘవేంద్రరావుకి జేడీ పెట్టిన ముద్దు పేరు ‘రాఘూ..’. అలా పిలిస్తేనే రాఘవేంద్రరావుకి ఇష్టం. అంతటి అనుబంధం ఉన్న ఇద్దరూ ‘బొంబాయి ప్రియుడు’ సెట్లో గొడవ పడ్డారు. ఇద్దరూ గొడవ పడ్డారు అనేదానికంటే.. జేడీనే రాఘవేంద్రరావుతో గొడవ పడ్డాడు అనడం బాగుంటుంది. అసలింతకీ ఏం జరిగింది?
‘బొంబాయి ప్రియుడు’లో టైటిల్ సాంగ్ మారిషస్ లో చిత్రీకరిస్తున్నారు. రంభ హీరోయిన్. ఆరోజు లాస్ట్ డే. సెట్ నుంచి.. ఎయిర్ పోర్ట్ కి వెళ్లిపోవాలి. మారిషస్ షూటింగ్ కి జేడీ వాళ్ల అమ్మగారు కూడా వచ్చారు. కానీ వచ్చిన వెంటనే అనారోగ్యం పాలయ్యారు. ఆమెను జేడీ పర్సనల్ డ్రైవర్ ఆసుపత్రిలో చేర్పించాడు. మారిషస్‌లో నిబంధన ఏమిటంటే.. ఆసుపత్రిలో చేర్పించివాళ్లే, డిశ్చార్జ్ టైమ్‌లో ఉండాలి. ‘ఈ రోజు షూటింగ్ అయిపోతోంది కదా, ఆసుపత్రి నుంచి అమ్మని తీసుకొచ్చేయ్. ఇట్నుంచి ఇటే ఎయిర్ పోర్ట్ కు వెళ్లిపోదాం’ అని జేడీ డ్రైవర్‌కి చెప్పేశాడు. కానీ.. డ్రైవర్ మాత్రం ఇంకా సెట్లోనే తచ్చాడడంతో జేడీకి అనుమానం వచ్చింది. `అదేంటి ఇంకా ఇక్కడే ఉన్నావ్. ఇలాగైతే ఆసుపత్రికి ఎప్పుడు వెళ్తావ్, అమ్మని ఎప్పుడు తీసుకొస్తావ్’ అని డ్రైవర్ని అడిగితే.. ‘ఏమో సార్.. డైరెక్టర్ గారు నన్ను రంభగారి అమ్మగారిని షాపింగ్ కి తీసుకెళ్లమన్నారు. ఆమెను షాపింగ్ కి తీసుకెళ్తే.. మీ అమ్మగార్ని తీసుకురావడం కుదరదు’ అని ఖరాఖండీగా చెప్పేశాడు. దాంతో జేడీకి చిర్రెత్తుకొచ్చింది. `మా అమ్మ ఆసుపత్రిలో ఉంటే మీకు షాపింగులు కావాల్సివచ్చిందా` అంటూ.. రాఘవేంద్రరావుని చూస్తూ ఓ బూతు మాట వాడేశాడు. అంతేకాదు… వేసుకొన్న జాకెట్ తీసి నేలకేసి కొట్టి, అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. జేడీకి అంత కోపం రావడం రాఘవేంద్రరావు ఎప్పుడూ చూడలేదు. దాంతో ఆయన మైండ్ కూడా బ్లాంక్ అయిపోయింది. కెమెరామెన్ ఛోటా కె.నాయుడు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా కుదర్లేదు. షూటింగ్ ఆగిపోయే పరిస్థితి. దాంతో డాన్స్ మాస్టర్ సుచిత్ర చంద్రబోస్ రంగంలోకి దిగి జేడీని బుబ్జగించాల్సివచ్చింది. సుచిత్రకు జేడీకి మంచి రిలేషన్ షిప్ వుంది. సుచిత్ర మాటతో.. జేడీ మెత్తబడ్డాడు. డ్రైవర్ అక్కడ్నుంచి ఆసుపత్రికి హుటాహుటిన వెళ్లి జేడీ అమ్మగార్ని డిశ్చార్జ్ చేయించి, ఎయిర్ పోర్ట్ కి బయలుదేరాడు. దాంతో షూటింగ్ సజావుగా సాగిపోయింది. ‘మీ అమ్మగారికి సీరియస్ గా ఉందన్న విషయం నాకు తెలీదు..’ అని రాఘవేంద్రరావు ఆ తరవాత సర్ది చెప్పారు. అలా ఆ గొడవ.. చల్లారిపోయింది.
‘ఆరోజు అంత గొడవ జరిగినా, రాఘవేంద్రరావు గారిని తిట్టినా ఆయన సీరియస్ గా తీసుకోలేదు. నా ఎమోషన్ని అర్థం చేసుకొన్నారు. ఆ తరవాత కూడా మా అనుబంధం కొనసాగింది. ఈ సంగతి ఎప్పుడు గుర్తు చేసినా రాఘవేంద్రరావు సరదా నవ్వేస్తారు. దాన్ని కూడా జోక్‌గా తీసుకొనే గొప్ప వ్యక్తిత్వం ఆయనది’ అంటుటారు జేడీ.