కొన్ని పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్ రెచ్చిపోతున్నాయి. కులాల చిచ్చు పెట్టేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఫేక్ న్యూస్‌ల విషయంలో రాటుదేలిపోయిన సోషల్ మీడియా హ్యాండిళ్లు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఏపీ ప్రభుత్వం ఉమన్ ఎంపవర్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిందని ఓ ట్విట్టర్ హ్యాండిల్ ప్రచారం ప్రారంభించింది. ఫేక్ న్యూస్ ల విషయంలో అనేక కేసులు ఎదుర్కొంటున్న ఆ హ్యాండిల్ .. మీనాక్షి చౌదరి అని నియమించారన్నట్లుగా ప్రకటించడంతో ఇతరులు అదే పద్దతిలో టీడీపీ ప్రభుత్వంపై కులచిచ్చు కుట్రలు ప్రారంభించారు.
అయితే కాసేపటికే ఏపీ ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉద్దేశపూర్వకంగా.. ఈ ప్రచారం చేస్తూ.. కులాల మధ్య మధ్య చిచ్చుపెట్టేలా వీరు వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. గతంలోనూ కొన్ని కేసులు ఇలాంటి అంశాలపై నమోదయ్యాయి. తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడం…. ఫేక్ అని చెప్పిన తర్వాత కూడా ప్రచారం చేయడాన్ని ప్రభుత్వ వర్గాలు సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
పోలీసులు కుల, మత చిచ్చు పెట్టే వారి విషయంలో చాలా సీరియస్ గా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. గతంలో ఇలాగే చేసిన తప్పుడు ప్రచారాలను పట్టించుకోకపోవడం వల్ల అదే నిజమని నమ్మించారు. నిజానికి మీనాక్షి చౌదరి తెలుగు అమ్మాయి కాదు. హర్యానాకు చెందినవారు. అసలు సంబంధం లేకపోయినా రాజకీయాల్లోకి తీసుకు వచ్చి కుల అంటగడుతున్నారు.