ఐపీఎస్ ఆఫీసర్ గా వ్యక్తిగత, రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగం ప్రకారం పని చేయాలి. చట్టాల ప్రకారం వ్యవహరించాలి. తేడా వస్తే అందరికీ చట్టాలు సమానం. కానీ తన కులం చూపించి చేసిన తప్పులకు శిక్షలు వేయడం తప్పని.. తన కులాన్ని టార్గెట్ చేసుకుని తనను శిక్షిస్తున్నారని ప్రచారం చేసుకుంటే రాజ్యాంగంపై కుట్ర చేసినట్లే. పీవీ సునీల్ వ్యవహారంలో ఆయన బావ.. మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ ఓ సంచలన పోస్టు సోషల్ మీడియాలో పెట్టారు. తప్పు చేసి ఆయన కులం పక్కన దాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటివారిని ఉపేక్షించకూడదని ఆయన వాదన.
సర్వీస్ నుంచి తొలగించాలంటున్న పీవీ రమేష్
పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆయనకు చెందిన అంబేద్కర్ ఇండియా మిషన్ కు చెందిన వారు.. వైసీపీకి చెందిన కార్యకర్తలు.. ఆయన దళితుడు కాబట్టే కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించడం ప్రారంభించారు. దీనికి కాకపోయినా… అసలు ఇలాంటి వాదన తీసుకు రావడమే అర్థరహితం అని తేల్చేస్తున్న పీవీ రమేష్ .. సునీల్ లాంటి వాళ్లను అసలు సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భార్యపై తీవ్ర నేరాలు చేసిన పీవీ సునీల్ పై ఇప్పటికే సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోందన్నారు.
నేరస్తుడు, నేరస్తుడే !
కులం, మతం , ప్రాంతం ఏదైనా నేరస్తుడు.. నేరస్తుడేనని పీవీ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. కులం పేరుతో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించే ఇటువంటి వ్యక్తులను అందరూ ఖండించాల్సి ఉందన్నారు. పీవీ సునీల్ కుమార్ .. పీవీ రమేష్ సోదరిని పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల సంసారం తర్వాత ఆమెపై వేధింపులకు పాల్పడటంతో విడిపోయారు. ఆమె కేసు పెట్టింది. ఆ కేసు విచారణలో ఉంది. అయితే తన పలుకుబడి కారణంగా ఆ కేసును ముందుకు సాగకుండా చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో పీవీ రమేష్ కూడా జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కానీ తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత పీవీ రమేష్ పైనా వేధింపులు జరిగాయి. పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే పీవీ రమేష్ దేనికీ తగ్గలేదు.
బాధితులు కులాల మాటెత్తితే ఏం జరుగుతుంది?
సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి. తన అధికారాన్ని ఉపయోగించి కొన్ని వందల మంది ని జగన్ రెడ్డి కోసం హింసించారు. వారంతా తమ కులాల సంగతి ఎత్తితే సునీల్ కుమార్ ఏమవుతారు?. ఆయా కులాలను టార్గెట్ చేసుకుని సునీల్ చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తే ఏమవుతుంది?. సునీల్ కులం పేరుతో ఓ సంస్థను పెట్టుకుని నడుపుతున్నారు. అది కూడా చట్ట విరుద్ధమే. ఆయనను సర్వీస్ ను తొలగించే అన్ని తప్పులు చేశారు. రాజకీయ లక్ష్యాలతో ఉన్న ఆయన ఎప్పటికైనా ముసుగు తీయాల్సిందే. ఆ దారిలోనే ఉన్నారని అందరికీ ఓ క్లారిటీ ఉంది.